Home ఆరోగ్యం ఖమ్మంలో తొలిసారి రోబోటిక్ మోకాళ్లు, తొంటి మార్పిడి సర్జరీలు

ఖమ్మంలో తొలిసారి రోబోటిక్ మోకాళ్లు, తొంటి మార్పిడి సర్జరీలు

26
0

జాబిశెట్టి ఆర్థోపెడిక్ హాస్పిటల్‌లో రోబోటిక్ మిషన్ ప్రారంభించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు

ఆర్గాన్ న్యూస్,ఖమ్మం, జనవరి 13:

ఖమ్మం జిల్లా కేంద్రంలోని నెహ్రూ నగర్‌లో ఉన్న జాబిశెట్టి ఆర్థోపెడిక్ హాస్పిటల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన రోబోటిక్ మోకాళ్లు, తొంటి మార్పిడి సర్జరీ మిషన్‌ను బీఆర్‌ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఖమ్మం మాజీ మంత్రి జలగం ప్రసాదరావు మంగళవారం సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలో తొలిసారిగా రోబోటిక్ సహాయంతో మోకాళ్లు, తొంటి మార్పిడి సర్జరీలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. రోగులకు తక్కువ నొప్పితో, ఖచ్చితత్వంతో, సులభంగా శస్త్రచికిత్సలు చేయడానికి ఈ ఆధునిక రోబోటిక్ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ వినూత్న వైద్య సదుపాయాన్ని జిల్లా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చిన డాక్టర్ జాబిశెట్టి గౌతమ్ (ఎంఎస్), డాక్టర్ రేణుకలను ప్రత్యేకంగా అభినందించారు.
ఇప్పటివరకు మోకాళ్లు, తొంటి మార్పిడి అవసరమైన రోగులు రోబోటిక్ సర్జరీ కోసం హైదరాబాద్ వంటి పెద్ద నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు అదే స్థాయి వైద్య సేవలు ఖమ్మంలోనే అందుబాటులోకి రావడం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపశమనమని డాక్టర్ గౌతమ్ తెలిపారు. దీంతో ప్రయాణ వ్యయం, కార్పొరేట్ ఆస్పత్రుల ఖర్చులు తగ్గుతాయని పేర్కొన్నారు.
రోబోటిక్ సహాయంతో చేసే మార్పిడి సర్జరీల వల్ల ఖచ్చితత్వం పెరగడం, తక్కువ నొప్పి, వేగంగా కోలుకోవడం, దీర్ఘకాలిక మన్నిక లభిస్తాయని వైద్యులు వివరించారు. మోకాళ్ల సమస్యలతో బాధపడుతున్న రోగులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జాబిశెట్టి హాస్పిటల్ మేనేజ్‌మెంట్ సభ్యులు పార నాగేశ్వరరావు, జాబిశెట్టి శ్రీనివాసరావు, ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కురువెళ్ల ప్రవీణ్, భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి, ఆర్టీసీ అధికారి గరికపాటి వెంకటేశ్వరరావు, పలువురు ప్రముఖ వైద్యులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు.