Home ఖమ్మం వీఓఏల పోరాటం న్యాయమైనదే

వీఓఏల పోరాటం న్యాయమైనదే

12
0
  • ప్రభుత్వం తక్షణమే డిమాండ్లు పరిష్కరించాలి: సీపీఎం
  • ఆరవ రోజుకు చేరిన గ్రామ దీపికల నిరసన దీక్షలు

కూసుమంచి,పాలేరు, ఆర్గాన్ న్యూస్ , మే 27:

గ్రామ స్థాయిలో మహిళా సంఘాల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషిస్తున్న వీఓఏలు (గ్రామ దీపికలు) తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమని సీపీఎం మండల కార్యదర్శి తోటకూరి రాజశేఖర్ విమర్శించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో గ్రామ దీపికలు చేపట్టిన ధర్నా బుధవారం ఆరవ రోజుకు చేరుకుంది. వీఓఏల నిరసనకు సంఘీభావంగా సీపీఎం పార్టీ తమ మద్దతు ప్రకటించింది.
ఈ సందర్భంగా తోటకూరి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సంఘాల గ్రామ దీపికలు తమ హక్కుల సాధన కోసం ఆందోళనలు నిర్వహిస్తున్నారని తెలిపారు. వారికి నెలకు రూ.20 వేల వేతనం చెల్లించడంతో పాటు సీసీలుగా పదోన్నతులు కల్పించాలని, 58 జీఓను సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మండలంలో సుమారు 56 మంది గ్రామ దీపికలు నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారని, 1200 మహిళా సంఘాలకు చెందిన సుమారు 12 వేల మంది మహిళల పొదుపు, రుణ వ్యవహారాలను వారు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. జనాభా లెక్కలు, ఎన్నికల విధులు, గ్రామ సభలు, అభివృద్ధి సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు మహిళల సమీకరణ, మెడికల్ క్యాంపుల నిర్వహణ వంటి అనేక బాధ్యతలను నిర్వర్తిస్తున్న గ్రామ దీపికలకు కేవలం రూ.5 వేల వేతనం మాత్రమే ఇవ్వడం అన్యాయమన్నారు.
కనీస వేతన చట్టం ప్రకారం ప్రతి గ్రామ దీపికకు గౌరవప్రదమైన వేతనం అందించాలని, వారి సేవలను ప్రభుత్వం గుర్తించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు బిక్కసాని గంగాధర్, చిట్టూరి వెంకటేశ్వర్లు, గిరిజన సంఘ నాయకుడు నాగేశ్వరరావు, గ్రామ దీపికల మండల అధ్యక్షురాలు జయమ్మ, రజిని, నసీమా, ప్రమీల, కృష్ణకుమారి, అరుణ, శ్రీదేవి, నాగమణి తదితరులు పాల్గొన్నారు.