Home తెలంగాణ మరణంలోనూ వెంటాడిన కులం..!

మరణంలోనూ వెంటాడిన కులం..!

10
0
  • అంత్యక్రియల వేళ వివక్ష ఆరోపణలు – వీణవంక మండలంలో కలకలం
  • ట్రాక్టర్ డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ సంఘం డిమాండ్ కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, జూన్ 2:

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం నర్సింహులపల్లి గ్రామంలో కుల వివక్ష ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. గ్రామానికి చెందిన వంతడుపుల పోచమ్మ ఇటీవల మృతిచెందగా, ఆమె అంత్యక్రియల కోసం గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ను కేటాయించాలని కుటుంబ సభ్యులు సర్పంచ్‌ను కోరారు. సర్పంచ్ అనుమతి ఇచ్చినప్పటికీ, ట్రాక్టర్ డ్రైవర్ కందం కిషన్‌రావు వాహనం నడపడానికి నిరాకరించాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
తాము దళిత వర్గానికి చెందినవారమనే కారణంతో అవమానకర వ్యాఖ్యలు చేస్తూ ట్రాక్టర్ నడపబోనని డ్రైవర్ చెప్పాడని, దీంతో అంత్యక్రియల సమయంలో తీవ్ర అవమానం, మనోవేదనకు గురయ్యామని కుటుంబ సభ్యులు వాపోయారు. మరణించిన వ్యక్తి అంతిమయాత్ర నిర్వహణలో కూడా కుల వివక్ష ప్రదర్శించడాన్ని గ్రామస్థులు ఖండిస్తున్నారు.
ఈ ఘటనపై ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర సంస్థ కార్యదర్శి వంతడుపుల బాబు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వానికి చెందిన వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి విధి నిర్వహణలో భాగంగా సేవలు అందించాల్సిన సమయంలో కుల వివక్షకు పాల్పడటం అత్యంత ఖండనీయమని పేర్కొన్నారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసి, వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి మాడ్గుల ఓదెలు, వంతడుపుల అరుణ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.