Home ఎడిటోరయిల్‌, ఆర్గాన్ న్యూస్ అమరుల త్యాగాల ఒడిలో పుట్టిన తెలంగాణం

అమరుల త్యాగాల ఒడిలో పుట్టిన తెలంగాణం

16
0

అమరుల త్యాగాల ఒడిలోన
పురుడోసుకున్న ఓ తెలంగాణమా…

నీ పుట్టుక వెనుక
ఎన్ని గాయాల చరిత్రో…
ఎన్ని కన్నీటి గాధలో…
ఎన్ని గుండెల మౌన రోదనలో…

నీ కోసం
తల్లి తన కొడుకును కోల్పోయింది,
భార్య తన భర్తను ఎదురు చూసింది,
చెల్లి తన అన్న ఫోటోను
కన్నీళ్లతో తడిపింది,
తండ్రి తన కొడుకు మృతదేహాన్ని
జెండాలో ముడుచుకుని మోశాడు…

లారీల దెబ్బలతో,
లాఠీల మోతలతో,
తూటాల వర్షాలతో
రణరంగమైపోయిన వీధుల్లో
ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి
ఆ ఉద్యమ నినాదాలు…

“జై తెలంగాణ…”
“మా నీళ్లు… మా నిధులు… మా ఉద్యోగాలు…”
అని గర్జించిన
విద్యార్థి గొంతుకల్లో
ఇంకా అగ్నికణాలే మిగిలి ఉన్నాయి…

ఓస్మానియా ప్రాంగణం నుంచి
గ్రామ చౌరస్తాల దాకా
ఉద్యమ జ్వాలలు ఎగిసిపడ్డాయి…
విద్యార్థి, రైతు, కూలి, ఉద్యోగి
అందరూ ఒక్కటై
స్వరాష్ట్ర గీతం పాడారు…

రక్తపు చుక్కలతో
తెలంగాణ పటాన్ని గీసిన
ఆ అమరవీరుల త్యాగం
చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది…

నీ కోసం
ఎంతమంది యువకులు
భవిష్యత్తును త్యాగం చేశారో,
ఎంతమంది తల్లులు
కన్నబిడ్డల్ని కోల్పోయారో,
ఎంతమంది కుటుంబాలు
అంధకారంలో మగ్గాయో
ఈ నేలకు మాత్రమే తెలుసు…

అగ్ని కాగడాలైన
అమరుల త్యాగాలు
ఈ నేలన చిగురించేది ఎన్నడో…
వారి కలల తెలంగాణ
ప్రజల కళ్లల్లో వెలుగులు నింపేది ఎన్నడో…

పోరాటాల పునాదులపై
నిర్మించిన ఈ తెలంగాణలో
ప్రతి బిడ్డకు సమాన హక్కులు రావాలి,
ప్రతి రైతు ముఖంలో నవ్వు పూయాలి,
ప్రతి యువకుడికి ఉద్యోగం దక్కాలి,
ప్రతి గిరిజనుడి గూడెంలో వెలుగు నిండాలి…

అప్పుడే
అమరుల ఆత్మలకు శాంతి లభిస్తుంది…
అప్పుడే
ఈ నేల నిజమైన స్వేచ్ఛను ఆస్వాదిస్తుంది…

తెలంగాణ అంటే
కేవలం భూభాగం కాదు…
అది కోట్ల గుండెల ఆవేదన…
అది అమరుల రక్తంతో రాసిన చరిత్ర…
అది త్యాగాల తల్లి…
అది పోరాటాల ప్రతీక…

జై తెలంగాణ…
జై జై తెలంగాణ…
అమరుల ఆశయాల తెలంగాణ చిరంజీవి కావాలి…

— అంబేద్కరిస్ట్, మంత్రి మహేష్..