అలా మార్చేసిన కోడి పందాల మాయ!
ఉప శీర్షికలు:
సంక్రాంతి అంటేనే కోడి పందెలు – కోడి పందెలు అంటేనే సంక్రాంతి
కృత్రిమ హైప్‌పై ఆర్గాన్ న్యూస్ కథనం
ప్రధాన వార్త సారాంశం:
పానూరు నుంచి ఆర్గాన్ ప్రతినిధి తిక్కనేట్టి శ్రీనివాస్:
సంక్రాంతి అంటేనే కోడి పందెలు.. కోడి పందెలు అంటేనే సంక్రాంతి.. ఇటీవల కాలంలో ఈ భావనను మనపై బలవంతంగా రుద్దిన ప్రధాన కారణం మీడియా సృష్టించిన కృత్రిమ హైప్. గతంలో కేవలం కోడి పందెలు చూడటానికి, భీమవరంలో దొరికే నాన్-వెజ్ స్పెషల్స్ తినడానికి వరుసగా రెండేళ్లు సంక్రాంతి పండుగకు భీమవరం వెళ్లొచ్చిన అనుభవంతోనే ఇది చెబుతున్నా. ఈ కోడి పందెలు నిజానికి ఒక సెలబ్రేషన్ కాదు, ఒక వ్యసనం. ఊరి శివార్లలో, మెయిన్ రోడ్డు పక్కనే పెద్ద బరి సెట్ చేసి, లైట్లు పెట్టి హంగామా అంతా చూసేందుకు అదిరిపోయేలా ఉంటుంది. కానీ అది కేవలం బిల్డప్ మాత్రమే. ఎందుకంటే అంత హడావిడి చేయకపోతే జనమే రారు.
అసలు అక్కడ నడిచేది ఆట కాదు.. కోడి పందెల మాటున నడిచేది పేకాట, గుండాటలు, క్యాసినో తరహా గ్యాంబ్లింగ్. బీర్ లిక్కర్, ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ కలిసిన ఒక పెద్ద మాఫియా ఎకానమీ. కార్ పార్కింగ్ నుంచి టూ వీలర్ పార్కింగ్ వరకూ అన్నీ ఆదాయ మార్గాలే!
సినిమాల్లో చూపించినట్టు నాటకీయత? మీడియా చెప్పినంత ఉత్కంట? నిజంగా చెప్పాలంటే ఏమీ ఉండదు. “ఇదిగో స్టార్ట్ అవుతుంది” అని ఊరిస్తారు. హడావిడిలో క్షణాల్లోనే ఓ కోడి కింద పడుతుంది, అంటే పందెం ముగుస్తుంది. డబ్బులు చేతులు మారతాయి. అక్కడ చూసే వాళ్లకు మిగిలేది ఖాళీ అనుభూతి మాత్రమే! గత పది-పదిహేనేళ్లుగా న్యూస్ ఛానల్స్ సృష్టించిన ఈ హైప్ వల్ల, ఒకప్పుడు కేవలం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల తూర్పు ప్రాంతాలకు పరిమితమైన ఈ కోడి పందెలు ఈ రోజు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వరకూ వ్యాపించాయంటే, దానికి రాజకీయ నాయకులు, పందెపు నిర్వాహకులు, సినీమాల్లో మీడియా చూపిస్తున్న బాధ్యతారాహిత్యమే కారణం.
పెద్ద పండుగ అయిన సంక్రాంతిని ఓ బెట్టింగ్ ఫెస్టివల్‌గా మార్చడం మన సంస్కృతికి, మన విలువలకు చేసిన ఘోర అన్యాయం. ఏదైనా ఒక్కసారి ఆ హడావిడిని దాటి బయటకి రండి. నిజమైన సంక్రాంతిని చూడండి. సంక్రాంతి అంటే ప్రకృతి పండుగ. సూర్యభగవానుడికి కృతజ్ఞత తెలిపే పండుగ. మన మట్టి పండుగ, మన పాడిపంటల పండుగ, మన పశువుల పండుగ, మన పెద్దలను తలుచుకునే పండుగ.
ఈ పండుగను బెట్టింగ్‌లకు కాదు.. బంధాలకు అంకితం చేయండి. కుటుంబంతో హ్యాపీగా గడపండి. పిల్లలను పొలాలకు తీసుకువెళ్లండి. మన మట్టిలోని మాధుర్యాన్ని వాళ్లకు చూపించండి. ఊరి జనంతో ముగ్గులు పెట్టండి. ఆటలు, పాటలు, ముగ్గులతో ఇంటిని నింపండి. అమ్మ చేసే అరిసెల రుచి మళ్ళీ గుర్తు చేసుకోండి.



