Home agriculture జూలై నెలాఖరులోపు మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి

జూలై నెలాఖరులోపు మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి

15
0
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్1:

మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పనుల పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జూన్ నాటికి పూర్తికావాల్సిన పనులు ఇప్పటికీ ఎందుకు పూర్తికాలేదని అధికారులను ప్రశ్నించారు. పనుల ఆలస్యానికి గల కారణాలను అడిగి తెలుసుకుని, నిర్దేశిత గడువుల్లో పనులు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించి పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని, జూలై నెలాఖరులోపు మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం పనులను పూర్తిచేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.

పినపాక నియోజకవర్గ రైతులే సీతారామ ఎత్తిపోతల పథకం కోసం తొలుత భూములు అందించారని గుర్తుచేసిన మంత్రి, ఈ ప్రాజెక్టు ద్వారా మొదటగా పినపాక నియోజకవర్గ రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, సాగునీటి వసతుల కల్పన ద్వారా వ్యవసాయాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు.

సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఇప్పటివరకు రూ.10 వేల కోట్లు వ్యయం చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో రైతులకు ప్రయోజనం చేకూర్చాలంటే ఇంకా రూ.9 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చొరవతో డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణ పనుల కోసం ఇప్పటికే రూ.4 వేల కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో డిస్ట్రిబ్యూటరీ కాలువల నిర్మాణం, భూసేకరణ ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేస్తే వచ్చే ఏడాది నాటికి పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని అన్నారు .
ఖమ్మం జిల్లాకు చెందిన సుమారు ఏడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టు పూర్తయితే 38 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం అందుబాటులోకి వచ్చి, ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని విస్తారమైన ఆయకట్టుకు సాగునీరు అందించగలమని తెలిపారు.
సీతారామ ఎత్తిపోతల పథకం ప్రధాన కాలువను ప్రారంభ స్థానం నుంచి చివరి వరకు పూర్తిస్థాయిలో శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు. కాలువల్లో ఎక్కడైనా మట్టి పేరుకుపోయిన ప్రాంతాలు, జారిన గట్లు లేదా ఇతర అవరోధాలు ఉంటే వెంటనే తొలగించి నీటి ప్రవాహానికి ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. రానున్న వర్షాకాలంలో నీటి విడుదలకు ముందే కాలువలు పూర్తిగా సిద్ధంగా ఉండేలా నిర్వహణ పనులను వేగవంతం చేయాలని, రైతులకు సాగునీరు సకాలంలో అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి సంధ్యా సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.