Home తెలంగాణ తోగ్గూడెం లో బరితెగించిన మైనింగ్ మాఫియా

తోగ్గూడెం లో బరితెగించిన మైనింగ్ మాఫియా

19
0

పేలుడు శబ్దాలతో అదురుతున్న గుండెలు

కాలుష్య కోరల్లో పరిసర గ్రామస్తులు

గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతున్న వైనం

అనుమతులు రెండు క్వారీలకే- మిగతా ఏడు అక్రమమే

మామూళ్ల మత్తులో అధికారులు

చర్యలు తీసుకోవాలంటున్న ప్రజానీకం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మే 29: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తోగ్గూడెంలో అక్రమ మైనింగ్ మాఫియా రోజు రోజుకు బరితెగిస్తోంది.
చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకొని గిరిజన చట్టాలను తుంగలో తొక్కి అక్రమ కంకర క్వారీలను నిర్వహిస్తూ కోట్ల రూపాయలను గడిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతోంది.
అనుమతి రెండింటికి మాత్రమే ఉన్నప్పటికీ రాజకీయ అధికార అండదండలతో, ధన బలంతో అనుమతులు లేకుండా మిగతా క్వారీలను నిర్వహిస్తూ కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను దొడ్డి దారిన దోచుకుంటూ సొమ్ము చేసుకుంటుంది. పేలుళ్ల సమయంలో వెలువడుతున్న భయంకరమైన శబ్దంతో తమ గుండెలు గుబ గుబ ఆడుతున్నాయని, ఇళ్ల గోడల సైతం బీటలు వారుతున్నాయని,ఈ క్షణాన ఏమి జరుగుతుందో తెలియని అయోమయం నెలకొందని అమాయక గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తోగ్గూడెం కంకర క్వారీల్లో పేలుళ్ల చప్పుడు పెద్దమ్మతల్లి గుడి వరకు వినిపిస్తుండటం గమనించదగ్గ విషయం.
ఈ మాఫియా కాలుష్య కోరలలో చిక్కుకున్న తోగ్గూడెం గ్రామం మొత్తం నిర్మానుష్యం మారి విలవిలలాడుతోంది. ఇదిలా ఉండగా అక్రమ మైనింగ్ మాఫియా నిర్వహిస్తూ అడ్డంగా దోచుకుంటున్న బడాబాబులు ప్రజల సంపద అయిన ఖనిజ సంపదను మింగటమే కాక గవర్నమెంట్ కు కట్టాల్సిన వందల కోట్ల సొమ్మును సైతం దిగ మింగుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు మామూళ్ల మత్తు వీడి ఆక్రమ మైనింగ్ నిర్వాహకుల పై కఠిన చర్యలు తీసుకోవాలని అమాయక గిరిజనలు వేడుకుంటున్నారు.