Home agriculture కొనుగోలు కేంద్రాల్లో ముక్కిపోతున్న వడ్లు

కొనుగోలు కేంద్రాల్లో ముక్కిపోతున్న వడ్లు

14
0
  • రైతులను వంచించడమేనా ప్రజా పాలన? : బీఆర్‌ఎస్ ఫైర్
  • ఏటూరునాగారం ఐకేపీ కేంద్రంలో రైతుల ఆవేదన
  • స్పందించకపోతే భారీ ఆందోళనలు తప్పవు
  • కాకులమర్రి లక్ష్మణ్ బాబు హెచ్చరిక

ములుగు, మే 29 (ఆర్గాన్ న్యూస్):

ఏటూరునాగారం మండలంలోని ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు రోజుల తరబడి పేరుకుపోయి అకాల వర్షాలకు తడిసి పాడవుతున్నాయని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటూ క్షేత్రస్థాయిలో అన్నదాతలను వంచించడం దారుణమని విమర్శించారు.
గురువారం బీఆర్‌ఎస్ పార్టీ నాయకత్వం ఏటూరునాగారం ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, గత 40 రోజులుగా ధాన్యం అమ్ముడుపోక తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలను స్వయంగా తెలుసుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కాకులమర్రి లక్ష్మణ్ బాబు, స్థానిక మంత్రి మరియు అధికార యంత్రాంగం రైతుల కష్టాలను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.
“మంత్రి పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు గానీ, కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న అవస్థలు కనిపించడం లేదా? ఈ ప్రాంతానికి వచ్చిన మంత్రి ఒక్కసారి అయినా కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతుల పరిస్థితిని పరిశీలించారా?” అంటూ ప్రశ్నించారు. వడ్లు నెలరోజులకు పైగా కేంద్రాల్లోనే ఉండిపోవడంతో అకాల వర్షాలకు తడిసి నల్లబడిపోతున్నాయని, రైతు కష్టానికి విలువ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాపాలన పేరుతో రైతులను అగచాట్ల పాలుచేయడం సరికాదని, వెంటనే వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేసి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. అధికారులు, పాలకులు తక్షణమే స్పందించకపోతే బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన జిల్లా వ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.