- ఊటూర్‌లో ఆందోళనకర పరిస్థితి మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 18:
చదువుల తల్లిగా నిలవాల్సిన బడి… ఇప్పుడు మత్తు బాబులకు అడ్డాగా మారిన ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూర్‌లో కలకలం రేపుతోంది. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో సామాజిక విద్రోహ శక్తులు పడగ విప్పడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
అర్ధరాత్రి వేళల్లో ఆకతాయిలు మద్యం, గంజాయి సేవిస్తూ హంగామా సృష్టించడం నిత్యకృత్యంగా మారింది. గతంలో నర్సరీగా ఉన్న ప్రాంతం, ఎస్సీ కాలనీ పాత స్కూల్, పక్కన అంగన్‌వాడీ కేంద్రం చుట్టూ పిచ్చిమొక్కలు, చెట్లు దట్టంగా పెరగడంతో ఈ ప్రదేశం అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారింది.
పక్క గ్రామాల నుంచి వస్తున్న గుర్తుతెలియని యువకులు ఉదయం నుంచే అక్కడ తిష్టవేసి, రాత్రి వరకు మత్తులో మునిగిపోతున్నారు. స్కూల్ తలుపులు పగులగొట్టడం, బీరు సీసాలు పగులగొట్టి బీభత్సం సృష్టించడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
ఈ పరిస్థితులపై ప్రశ్నిస్తే దాడులు జరుగుతాయేమోనన్న భయంతో ప్రజలు మౌనం పాటిస్తున్నారు. పోలీసులు అప్పుడప్పుడు పెట్రోలింగ్‌కు వచ్చి వెళ్లడం కాకుండా, రాత్రి వేళల్లో నిరంతర గస్తీ నిర్వహించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
అలాగే పాఠశాల ఆవరణలో అడవిలా పెరిగిన చెట్లను తొలగించి, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలను ప్రజా అవసరాలకు వినియోగిస్తే ఇలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని అభిప్రాయపడుతున్నారు.
యువత మత్తుకు బానిసై తమ భవిష్యత్తును పాడు చేసుకోవడమే కాకుండా, సమాజానికి ముప్పుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యా నిలయాన్ని రక్షించాలని ఊటూర్ గ్రామ ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.


