- అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిపై పెరుగుతున్న ప్రమాదాలు
- నిర్లక్ష్య రైతులకు పోలీసుల గట్టి హెచ్చరిక
మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 6:
మిర్యాలగూడ నియోజకవర్గంలోని అద్దంకి–నార్కెట్‌పల్లి హైవేపై పశువులు తిరగడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని వాడపల్లి పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. వేసవి కాలంలో మేత కొరత కారణంగా కొంతమంది నిర్లక్ష్య రైతులు తమ బర్రెలను రోడ్లపైకి వదిలేయడం, మరికొన్ని తాడులు తెంపుకుని రహదారులపైకి రావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో రహదారి మధ్యలో ఉన్న డివైడర్ వద్ద పశువులు నిలవడం వాహనదారులకు సరిగా కనిపించక ప్రమాదాలకు దారితీస్తోందని పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల రోడ్డు దాటుతున్న సమయంలో ఒక బర్రెను కారు ఢీకొని అది మృతి చెందగా, కారులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలు అయిన ఘటనను గుర్తు చేశారు. ఈ ఘటన రైతులకు ఆర్థిక నష్టంతో పాటు వాహనదారుల ప్రాణాలకు ముప్పు కలిగించినట్లు తెలిపారు.
👉 రైతులకు సూచనలు
సాయంత్రం సమయానికి పశువులను బలమైన త్రాడుతో కట్టివేయాలి.
రోడ్లపైకి ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదు.
పశువుల కొమ్ములకు రేడియం స్టిక్కర్లు అమర్చడం మంచిదని సూచించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
రోడ్లపై పశువులను వదిలి ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వాడపల్లి ఎస్‌ఐ హెచ్చరించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.


