Home POLITICS పేద మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

పేద మహిళల ఆర్థిక సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

4
0
  • రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
  • మహిళల ఆదాయం పెరిగితేనే కుటుంబ సంక్షేమం సాధ్యం
  • ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం ద్వారా పేదలకు భరోసా
  • అంగన్వాడీ సేవలు నిబద్ధతతో నిర్వహించాలి
  • గురుకుల విద్యతో పేదరికానికి చెక్ – ప్రతి పిల్లవాడికి నాణ్యమైన భవిష్యత్
  • క్యాంపు కార్యాలయంలో 500 కుట్టుమిషన్లు, టీఎన్జీవో ఫంక్షన్ హాల్‌లో అంగన్వాడీ టీచర్లకు సెల్‌ఫోన్లు పంపిణీ చేసిన మంత్రి

ఖమ్మం ప్రతినిధి ,
ఆర్గాన్ న్యూస్,ఏప్రిల్13:

పేద మహిళల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు.
సోమవారం ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో 500 మంది మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేయడంతో పాటు, టీఎన్జీవో ఫంక్షన్ హాల్‌లో అంగన్వాడీ టీచర్లకు సెల్‌ఫోన్లను మంత్రి అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ…

మహిళల సాధికారత కుటుంబ సంక్షేమానికి అత్యంత అవసరమని అన్నారు. పేదరికం నుండి బయటకు తీసుకురావాలంటే మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆదాయం సంపాదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల నుంచి 23 వేల కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు.
మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై ప్రభుత్వం 10 వేల కోట్ల వ్యయం చేస్తోందని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఖమ్మం నగరంలో ఇప్పటికే 2500 ఇళ్లు మంజూరు చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 22 వేల కోట్ల వ్యయంతో కార్యక్రమం అమలు జరుగుతోందని, వచ్చే ఏడాది మరో 3500 మంది లబ్ధిదారులు ప్రయోజనం పొందనున్నారని తెలిపారు.
పేద ప్రజలు కూడా నాణ్యమైన ఆహారం తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 14 వేల కోట్లతో సన్నబియ్యం పంపిణీ చేస్తోందని, గతంలో ఈ ప్రయోజనం మధ్యవర్తులకు మాత్రమే చేరేదని, ప్రస్తుతం నేరుగా ప్రజలకు అందిస్తున్నామని మంత్రి అన్నారు.
రైతులు, యువత, కూలీలు ప్రతి వర్గం ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందుతున్నారని మంత్రి తెలిపారు. ముఖ్యంగా మైనారిటీ పిల్లలు తప్పనిసరిగా విద్యను అభ్యసించాలన్నారు.
గురుకుల పాఠశాలల్లో 3 వేల మంది విద్యార్థులు చదువుకునే అవకాశం కల్పించగా, ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం సంవత్సరానికి సుమారు 1.5 లక్షలు వెచ్చిస్తోందని చెప్పారు. మన పిల్లలు విద్యను అభ్యసిస్తేనే పేదరికం నుండి బయటపడగలమని, నాణ్యమైన విద్య పొందిన పిల్లలు భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు సాధించి కుటుంబానికి గౌరవం, ఆనందం తీసుకొస్తారని మంత్రి తెలిపారు.

అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్ పంపిణి వద్ద ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి…

తాను గతంలో అంగన్వాడీ శాఖ మంత్రిగా పని చేసిన సమయంలో రెండు సార్లు వేతనాలను పెంచినట్లు గుర్తుచేశారు. అంగన్వాడీ టీచర్లు పేద ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం పొందారని, దానిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చిన్న చిన్న అసౌకర్యాల పేరుతో ర్యాలీలు చేయకుండా నిబద్ధతతో పనిచేయాలని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
అంగన్వాడీ టీచర్లకు అందజేసిన సెల్‌ఫోన్లు ప్రజలకు సేవలందించేందుకు సమర్థంగా ఉపయోగించుకోవాలని మంత్రి సూచించారు.
సెల్‌ఫోన్ల ద్వారా అంగన్వాడీ సేవలపై పూర్తి స్థాయి పర్యవేక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు కొత్త భవనాలు మంజూరు చేసినట్లు, వాటిని అన్ని సౌకర్యాలతో త్వరగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
అనంతరం టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ వద్ద ఖమ్మం నగరపాలక సంస్థ చే కొనుగోలు చేసిన 3 రహదారి ఊడ్చే యంత్రాలను మంత్రి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ అభిషేక్ అగస్త్య, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ముజాహిద్, జిల్లా సంక్షేమ అధికారిణి వేల్పుల విజేత, ఖమ్మం నగర పాలక సంస్థ సహాయ కమీషనర్ అనిల్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.