Home తెలంగాణ పోడు భూముల్లో కందకాలు ఆపాలి

పోడు భూముల్లో కందకాలు ఆపాలి

22
0
  • ఫారెస్ట్ అధికారుల చర్యలపై సిపిఎం ఆగ్రహం
  • ఏటూరు నాగారం ఐటీడీఏ వద్ద ధర్నా, భారీ ర్యాలీతో వినతి పత్రం సమర్పణ
  • ఆదివాసులకు హక్కు పట్టాలు ఇవ్వాలని, లేకపోతే ఉద్యమాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరిక

ములుగు జిల్లా,ఆర్గాన్ న్యూస్,ఏప్రిల్ 16:

పోడు సాగు భూముల్లో ఫారెస్ట్ అధికారులు కందకాలు తీయడం తక్షణమే నిలిపివేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎండి దావూద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏటూరు నాగారం మండల కమిటీ ఆధ్వర్యంలో ఐటీడీఏ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం భారీ ర్యాలీ చేపట్టి ఫారెస్ట్ డివిజన్ ఆఫీసు ముందు నిరసన వ్యక్తం చేశారు.
తదుపరి ఐటీడీఏ ఏపీవో వసంతరావు, ఫారెస్ట్ సబ్ డీఎఫ్ఓ రమేష్‌లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దావూద్ మాట్లాడుతూ కన్నాయిగూడెం మండలం మల్కంపల్లి గ్రామానికి చెందిన 26 ఆదివాసి కుటుంబాలు గత 20 సంవత్సరాలుగా పోడు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాయని తెలిపారు.
గతంలో భూముల సర్వే జరిగినప్పటికీ ఎస్టీ సర్టిఫికెట్ లేకపోవడంతో హక్కు పత్రాలు ఇవ్వలేదని, అప్పట్లో ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం చూపుతోందని విమర్శించారు.
ఇప్పటికీ సాగులో ఉన్న భూముల్లో ఫారెస్ట్ అధికారులు బలవంతంగా కందకాలు తీయడం దౌర్జన్యమని, వెంటనే ఈ చర్యలను నిలిపివేయాలని మంత్రి సీతక్క జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా పోరాటాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యులు రవి, తోలం కృష్ణయ్య, చిరంజీవి, గ్రామస్తులు భద్రయ్య, చుక్కయ్య, మంగయ్య, జోగయ్య, శుకురామ్ తదితరులు పాల్గొన్నారు.