- సిపిఎం వన్ టౌన్ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి పత్రం
ఖమ్మం వన్ టౌన్ , ఆర్గాన్ న్యూస్, ఏప్రిల్ 13:
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద పెండింగ్‌లో ఉన్న చెక్కులను తక్షణమే విడుదల చేయాలని సిపిఎం పార్టీ ఖమ్మం వన్ టౌన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఖమ్మం ఆర్డీవో కార్యాలయంలో డిఓ గారికి వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సిపిఎం వన్ టౌన్ కార్యదర్శి షేక్ నాగుల్ మీరా మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులు ఆలస్యమవడంతో అమ్మాయిల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పెళ్లిళ్ల కోసం అప్పులు తీసుకుని ఖర్చులు చేసిన కుటుంబాలు ఇప్పుడు ఆర్థిక భారంతో కుంగిపోతున్నాయని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అమ్మాయికి తులం బంగారం అందిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు. వెంటనే ఆ హామీని అమలు చేసి అర్హులైన ప్రతి లబ్ధిదారికి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలతో పాటు తులం బంగారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర కమిటీ సభ్యులు షేక్ మెహ్రున్నిసా బేగం, ఖమ్మం నగర మహిళా సంఘం అధ్యక్షురాలు భాగం అజిత, నగర కమిటీ సభ్యులు కూరపాటి శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు సిఐటియు పుట్టా రవి, షేక్ సాహెబ్ హుస్సేన్, నర్సింగ్, కృష్ణారావు, ధనాలకోట రవికుమార్, షేక్ యాకూబ్ పాషా, షేక్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.


