- నిండు గర్భిణీ ఊబిది రేఖ ఆవేదన మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, జనవరి 23:
పొట్టకూటి కోసం ఇతర రాష్ట్రాలు తిరిగే కుటుంబాలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామంలో ఎన్నో ఉన్నాయి. జీవనోపాధి కోసం చిన్ననాటి నుంచే వలస బాట పట్టిన ఈ కుటుంబాల జీవితాల్లో గుర్తింపు లేమి పెద్ద సమస్యగా మారుతోంది.
బేడ బుడగ జంగం సామాజిక వర్గానికి చెందిన 23 ఏండ్ల ఊబిది రేఖ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. ఆమె కుటుంబం చిన్నప్పటి నుంచే ఇతర రాష్ట్రాల్లో చిన్నచిన్న పనులు చేస్తూ జీవనం సాగించింది. ఈ క్రమంలో రేఖ పుట్టిన సమయంలో అధికారికంగా పేరు నమోదు కాలేదు. ఫలితంగా ఇప్పటివరకు ఆమెకు ఆధార్ కార్డు లేదు.
ప్రస్తుతం నిండు గర్భిణీగా ఉన్న రేఖ ఆసుపత్రుల్లో చికిత్స కోసం తిరుగుతుంటే… ఆధార్ కార్డు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కరీంనగర్ మాతా–శిశు ఆసుపత్రిలో ప్రసూతి కోసం ఆధార్ తప్పనిసరి అని డాక్టర్లు చెబుతున్నారని ఆమె వాపోతోంది. ప్రైవేట్ ఆసుపత్రిలో డెలివరీ చేయించుకునేంత ఆర్థిక స్థోమత తమకు లేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఆధార్ లేని కారణంగా చికిత్స నిరాకరించడం తనను మానసికంగా కుంగదీస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది.
“ఆధార్ కార్డు లేకపోతే నేను అమ్మను కాలేనా?” అని కన్నీటితో ప్రశ్నిస్తోంది రేఖ. తనలాంటి వలస కుటుంబాల పిల్లలకు చిన్ననాటే గుర్తింపు దక్కకపోవడంతో, ఇప్పుడు జీవితంలో కీలక సమయంలో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతోంది. అధికారులు తన పరిస్థితిని అర్థం చేసుకుని మానవీయంగా స్పందించి, తక్షణమే ఆధార్ కార్డు ఇప్పించి తనకు గుర్తింపునివ్వాలని ఆమె కోరుతోంది.
ఈ ఘటన వలస కుటుంబాల పిల్లలకు జనన నమోదు, గుర్తింపు పత్రాల ప్రాధాన్యతపై మరోసారి ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇలాంటి కుటుంబాలకు గుర్తింపు కల్పించాల్సిన అవసరం ఎంతగానో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.








