Home తెలంగాణ రోడ్డు భద్రతే లక్ష్యం

రోడ్డు భద్రతే లక్ష్యం

19
0
  • జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల రీజనల్ స్థాయి ముగింపు

కొత్తగూడెం ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్:

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా రీజనల్ స్థాయి ముగింపు కార్యక్రమాన్ని కొత్తగూడెం డిపోలో నిర్వహించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, ప్రాంతీయ రవాణా అధికారి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, స్థానిక డీఎస్పీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రీజియన్ స్థాయిలో ముగ్గురు ప్రమాద రహిత డ్రైవర్లను ఘనంగా సన్మానించారు.
ప్రథమ స్థానంలో సత్తుపల్లి డిపోకు చెందిన ఎస్.ఎస్. రావు (30 సంవత్సరాలు 4 నెలల ప్రమాద రహిత సేవ), ద్వితీయ స్థానంలో ఖమ్మం డిపోకు చెందిన జి.ఎన్. రావు (29 సంవత్సరాలు 3 నెలల ప్రమాద రహిత సేవ), తృతీయ స్థానంలో ఖమ్మం డిపోకు చెందిన ఆర్. వెంకటేశ్వర్లు (27 సంవత్సరాలు 9 నెలల ప్రమాద రహిత సేవ) నిలిచారు.

అదేవిధంగా జిల్లాలోని ఏడు డిపోల నుంచి ఎంపికైన ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్లను క్యాష్ అవార్డులు, ప్రశంసా పత్రాలు, శాలువాలతో సన్మానించారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ, ప్రజల్లో ఆర్టీసీ డ్రైవర్లపై ఉన్న విశ్వాసాన్ని మరింత పెంచేలా బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని సూచించారు. జిల్లాలో మత్తు పదార్థాల ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రయాణికుల లగేజీలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలపై అవగాహన పెంచుకొని అవసరమైన సందర్భంలో 1930కు సమాచారం ఇవ్వాలని కోరారు.
ప్రాంతీయ రవాణా అధికారి మాట్లాడుతూ, ఉత్తమ డ్రైవింగ్ అలవాట్లతో పాటు వాహనాన్ని ఎల్లప్పుడూ మంచి స్థితిలో ఉంచుకోవడం అవసరమని అన్నారు. డ్రైవర్ల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని పేర్కొంటూ, రహదారి ప్రమాదాల సమయంలో బాధితులకు సహాయం చేస్తూ “రహవీర్”లుగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలగాలని సూచించారు.
మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, ప్రమాదాల నివారణకు రీజియన్ స్థాయిలో చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఈ ఏడాది జిల్లాను ఉత్తమ ప్రమాద రహిత జిల్లాగా నిలిపేందుకు డ్రైవర్లు సహకరించాలని కోరారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ, సరిహద్దుల్లో విధులు నిర్వర్తించే సైనికుల క్రమశిక్షణ డ్రైవర్లలోనూ ఉండాలని అన్నారు. ప్రయాణికులకు ప్రమాద రహిత ప్రయాణ అనుభవం అందించేందుకు ప్రతి డ్రైవరు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వివేక వర్ధిని హైస్కూల్ విద్యార్థినుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. వ్యాస రచన పోటీల విజేతలకు జ్ఞాపికలను అందించారు. అనంతరం స్థానిక పోలీస్ సీఐ ఆధ్వర్యంలో హాజరైన వారందరితో రోడ్డు భద్రతా ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో అన్ని డిపోల డిపో మేనేజర్లు, అకౌంట్స్, పర్సనల్ అధికారులు, గ్యారేజ్, ట్రాఫిక్ సూపర్వైజర్లు, ఎస్‌డీఐలు, సేఫ్టీ వార్డెన్లు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.