ఉరికొయ్యను చిరునవ్వుతో ముద్దాడిన ధీశాలురు భగత్ సింగ్ త్రయం
దేశ భక్తుల బలిదానాలను మరువకూడదు
అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం యువత పోరాడాలి
విప్లవ పంథాలో పయనించి భారతాన్ని కాపాడుకుందాం
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా
సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా భగత్ సింగ్ 95వ వర్ధంతి
అమరవీరుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాలులర్పించిన సాబీర్ పాషా
కొత్తగూడెం ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చి 23: దేశంకోసం, సమసమాజ స్థాపనకు అమరులైన విప్లవ వీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని, వారి బలిదానాలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పిలుపునిచ్చారు. సోమవారం కొత్తగూడెంలోని సిపిఐ జిల్లా కార్యాలయం ‘శేషగిరి భవన్’లో సర్దార్ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్’ల 95వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విప్లవ వీరుల చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన సదస్సులో సాబీర్ పాషా మాట్లాడుతూ బ్రిటిష్ నిరంకుశ పాలనపై ఎదిరించి పోరాడి, అతి చిన్న వయసులోనే చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడిన భగత్ సింగ్ త్రయం ధైర్యసాహసాలు నేటి యువతకు గొప్ప స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. కేవలం బ్రిటిష్ వారిని వెళ్లగొట్టడమే కాకుండా, సమాజంలో దోపిడీ లేని, సమానత్వంతో కూడిన వ్యవస్థను నిర్మించాలని వారు కలలు కన్నారని గుర్తుచేశారు. ఆ అమరవీరుల ఆశయాల కోసం నిరంతరం పోరాడటమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన స్పష్టం చేశారు. నేటి పాలకులు కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ దేశ సంపదను దోచిపెడుతున్నారని, దీనికి వ్యతిరేకంగా విప్లవ వీరుల స్ఫూర్తితో పోరాటాలు సాగించాలన్నారు. అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం యువత నడుం బిగించాలని, అప్పుడే వారి త్యాగాలకు సార్థకత చేకూరుతుందని తెలిపారు. దేశభక్తి అనేది కేవలం మాటలకే పరిమితం కాకుండా, పేద అణగారిన వర్గాల సంక్షేమం కోసం పని చేయడంలోనే ఉందని అభిప్రాయపడ్డారు. ఈ చారిత్రక త్యాగాలను భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, పోరాట పంథాలో పయనించి దేశాన్ని కాపాడుకోవాలని కోరారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి కార్యకర్త విప్లవ వీరుల బాటలో పయనించాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నరాటి ప్రసాద్, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, దేవరకొండ శంకర్, జిల్లా సమితి సభ్యులు వంగ వెంకట్, గెడ్డాడు నగేష్, భూక్యా శ్రీనివాస్, వి మల్లికార్జున్, గోనె మని, నాయకులు మాతంగి లింగయ్య, లక్ష్మీనారాయణ, రాములు, రాజు తదితరులు పాల్గొన్నారు.


