Home క్రైమ్ ఉప సర్పంచ్ వేధింపులతో మహిళా సర్పంచ్ ఆత్మహత్య యత్నం !

ఉప సర్పంచ్ వేధింపులతో మహిళా సర్పంచ్ ఆత్మహత్య యత్నం !

20
0
  • మహిళా సర్పంచులకు భద్రత కల్పించాలి: గ్రామస్తుల డిమాండ్

ములుగు జిల్లా, మార్చి 13,ఆర్గాన్ న్యూస్:

ములుగు జిల్లాలోని జాకారం గ్రామపంచాయతీలో ఉపసర్పంచ్‌తో నెలకొన్న విభేదాలు తీవ్రరూపం దాల్చి మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. జాకారం గ్రామ సర్పంచ్ మమత గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది.

ఉపసర్పంచ్ వేధింపులే కారణమా..?

స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపొందిన అనంతరం జాకారం గ్రామపంచాయతీలో ఉపసర్పంచ్ తనకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని సర్పంచ్‌పై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. గ్రామపంచాయతీ కార్యాలయంలో తన కోసం ప్రత్యేక గది, చాంబర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.
తాను సొంతంగా కొనుగోలు చేసిన కుర్చీలు, టేబుళ్లు పెట్టుకునేందుకు ప్రత్యేకంగా గది ఇవ్వాలని పలుమార్లు సర్పంచ్‌ను కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తరచూ సర్పంచ్, ఉపసర్పంచ్ మధ్య వాగ్వాదాలు జరిగాయని, గ్రామ అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులపై సంతకాలు చేయడంలో కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.

మహిళా సర్పంచ్‌పై మానసిక ఒత్తిడి

సర్పంచ్‌గా ఉన్న తనను మానసికంగా అవమానించేలా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని సర్పంచ్ మమత ఆరోపించారు. ఈ వేధింపులను తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను ములుగు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స అందించగా ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు

ఈ ఘటన వెలుగులోకి రావడంతో జాకారం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా ప్రజాప్రతినిధులపై ఇలాంటి వేధింపులు జరగడం దురదృష్టకరమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో మహిళా సర్పంచులకు సరైన స్వేచ్ఛ, భద్రత లేకపోవడం ఆందోళనకరమని స్థానికులు అంటున్నారు.
ములుగు జిల్లా కలెక్టర్ మహిళా సర్పంచులకు తగిన భద్రత కల్పించి, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.