Home అంతర్జాతీయం డాలర్ ఆధిపత్యానికి పెను సవాల్

డాలర్ ఆధిపత్యానికి పెను సవాల్

74
0

బిజినెస్ ఆర్గాన్:

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దశాబ్దాలుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న అమెరికన్ డాలర్ ఆధిపత్యానికి గణనీయమైన సవాళ్లు ఎదురవుతున్నాయా అనే ప్రశ్నలు అంతర్జాతీయ ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా చైనా భారత్ కలిసి చేపడుతున్న ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలు డాలర్ ఆధారిత వ్యవస్థకు ప్రత్యామ్నాయ దిశను సూచిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా విధించిన ఆంక్షలు రష్యా చైనా మధ్య వాణిజ్యాన్ని నిలిపివేయలేకపోయాయని అంతర్జాతీయ నివేదికలు సూచిస్తున్నాయి. డాలర్ స్థానంలో యువాన్ రూబుల్ వంటి స్థానిక కరెన్సీలతో ద్వైపాక్షిక వాణిజ్యం విస్తరించడంతో పశ్చిమ దేశాల లెక్కల్లో కనిపించని లావాదేవీలు భారీగా పెరిగినట్టు అంచనాలు వెలువడుతున్నాయి. చైనా రష్యా మధ్య జరుగుతున్న వాణిజ్యంలో పెద్ద భాగం డాలర్ వ్యవస్థకు వెలుపల సాగుతున్నట్టు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు

ఇండియా పాత్ర పై ప్రపంచం చూపు

ఈ పరిణామాల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తున్నట్టు విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు ప్రతిఫలంగా భారత బ్యాంకుల్లో నిలిచిపోయిన రూపాయిలను భారత్ లోని మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించే దిశగా చర్యలు తీసుకున్నట్టు సమాచారం. ఈ పెట్టుబడులు రైల్వే మౌలిక వసతులు ఇతర అభివృద్ధి పనులకు ఊతమిస్తున్నాయని ఆర్థిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది కేవలం వాణిజ్య లావాదేవీ కాకుండా ఆంక్షలను ఎదుర్కొనే వ్యూహాత్మక మార్గంగా అభివర్ణిస్తున్నారు
ఇక డిజిటల్ కరెన్సీ రంగంలో కూడా డాలర్ ఆధిపత్యానికి ప్రత్యామ్నాయ ప్రయత్నాలు వేగంగా సాగుతున్నాయి. ప్రాజెక్ట్ ఎంబ్రిడ్జ్ వంటి వ్యవస్థల ద్వారా స్విఫ్ట్ వ్యవస్థకు వెలుపల దేశాల మధ్య నేరుగా చెల్లింపులు జరుగుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. మధ్యవర్తులు లేకుండా సెకన్లలో లావాదేవీలు పూర్తవడం వల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రభావం తగ్గే అవకాశాలు ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు

గోల్డ్ ఈజ్ గోల్డ్

ఇక బంగారం ఆధారిత కరెన్సీ వ్యవస్థలపై కూడా అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది. ఫియట్ కరెన్సీలకు బదులుగా బంగారాన్ని ఆధారంగా చేసుకునే కొత్త ఆర్థిక యూనిట్లపై చర్చ జరుగుతోంది. అనేక దేశాలు డాలర్ నిల్వల కంటే బంగారు నిల్వల పెంపుపై దృష్టి పెట్టినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి
ఈ నేపథ్యంలో తూర్పు దేశాల మధ్య పరస్పర విశ్వాసం వాణిజ్య విస్తరణ పెరుగుతుండగా డాలర్ కేంద్రిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రత్యామ్నాయ ధోరణులు స్పష్టమవుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రానున్న సంవత్సరాల్లో గ్లోబల్ ఫైనాన్స్‌లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు