- బడంగ్‌పేట సర్కిల్ పాలకులు – అధికారుల ఘోర నిర్లక్ష్యం
- 4 వేల మంది నరక జీవితం – ప్రజారోగ్యంపై ముప్పు
రంగారెడ్డి ప్రతినిధి | ఆర్గాన్ న్యూస్ | ఫిబ్రవరి 2 :
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శంషాబాద్ జోన్ – బడంగ్‌పేట సర్కిల్ 61వ డివిజన్ కుర్మన్‌కూడ ఇంద్రానగర్ ప్రజల జీవితం మురుగు నీటిలో మునిగిపోయిందని భారతీయ జనతా పార్టీ క్లస్టర్ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.
సోమవారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, సుమారు 4,000 మంది ప్రజలు నివసిస్తున్న ఇంద్రానగర్ కాలనీలో ఇప్పటికీ ఔట్లెట్ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం పాలకుల పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. డ్రైనేజీ లేకపోవడంతో ఏర్పాటు చేసిన 12 సెప్టిక్ ట్యాంకులు పూర్తిగా నిండిపోయి, గత కొద్ది రోజులుగా మురుగు నీరు బయటకు పొంగి చెరువులా నిలిచిపోయిందని తెలిపారు.
కాలనీలో అడుగు వేయాలంటే మురికి నీరు, తీవ్రమైన దుర్గంధం, దోమల దాడి తప్ప మరో దారి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దోమల కారణంగా జ్వరాలు, అంటువ్యాధులు వ్యాప్తి చెందుతున్నా అధికారులు, పాలకులకు ఇవేమీ కనిపించడంలేదా? అని ప్రశ్నించారు.
ప్రజల ప్రాణాల కంటే రాజకీయ కార్యక్రమాలే ముఖ్యమా? అని ప్రశ్నించిన రామకృష్ణారెడ్డి, ఇదే కాలనీలో రాజకీయ పార్టీలు చేరికల హడావుడి నిర్వహిస్తుంటే, ప్రజలు మాత్రం మురుగు నీటిలో నరకయాతన అనుభవిస్తున్నారని మండిపడ్డారు. ఇది పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ట అని విమర్శించారు.
స్థానిక ఎమ్మెల్యేకు కనబడటం లేదా?
స్థానిక శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి మాజీ సీఎం కేసీఆర్ సీటు విచారణ కోసం రోడ్డెక్కి నిరసనలు చేయడం బాగానే ఉందని, కానీ మీ నియోజకవర్గంలో ప్రజలు మురుగు నీటితో అల్లాడుతుంటే ఈ సమస్యలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బడంగ్‌పేట ప్రజలు మీకు ఎందుకు గుర్తుకు రావడం లేదని బీజేపీ సూటిగా ప్రశ్నిస్తుందని తెలిపారు.
బడంగ్‌పేట సర్కిల్ సమస్యలను తాను పదేపదే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఒక్క అధికారి కూడా స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ప్రజలు చెల్లించే పన్నులతో జీతాలు తీసుకుని ఏసీ గదుల్లో కూర్చోవడానికి అధికారులు కాదని, ప్రజల సమస్యలు పరిష్కరించడమే వారి బాధ్యత అని రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు.
ఇంద్రానగర్‌లో తక్షణమే డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి, ప్రజారోగ్య సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోకపోతే, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇంద్రానగర్ ప్రజలతో కలిసి బడంగ్‌పేట సర్కిల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన తీవ్ర హెచ్చరిక చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు ఏనుగు రామిరెడ్డి, వేణుగోపాల్, నరేష్, శ్రీనివాసచారి, ఆంజనేయులు యాదవ్, ప్రవీణ్ గౌడ్, పవన్, సతీష్, నంద చైతన్య, సుధాకర్, శివ తదితరులు పాల్గొన్నారు.



