Home తెలంగాణ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

14
0
  • డా. ఎస్.కె. అఖీబ్ షరీఫ్

వేలేరుపాడు, ఆర్గాన్ న్యూస్, జూన్ 12:

వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మెలియోయిడోసిస్ (Melioidosis) అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా వ్యాధి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. ఎస్.కె. అఖీబ్ షరీఫ్ సూచించారు.
ఆయన మాట్లాడుతూ, మెలియోయిడోసిస్ అనేది బుర్కోల్డేరియా ప్సూడోమల్లై (Burkholderia pseudomallei) అనే బ్యాక్టీరియా వల్ల వచ్చే అంటువ్యాధి అని తెలిపారు. ఈ క్రిమి సాధారణంగా నేలలో, నిల్వ నీటిలో ఉండి వర్షాకాలంలో మరింతగా వ్యాపించే అవకాశం ఉంటుందని చెప్పారు. గాయాలు, కోతలు లేదా చర్మ పగుళ్ల ద్వారా ఈ క్రిమి శరీరంలోకి ప్రవేశించి వ్యాధికి కారణమవుతుందని వివరించారు.
వ్యవసాయ పనులు చేసే రైతులు, బురద ప్రాంతాల్లో పనిచేసే కార్మికులు, అలాగే మధుమేహం, మూత్రపిండాల వ్యాధులు లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.

వ్యాధి లక్షణాలు:

జ్వరం,
వణుకులు,
దగ్గు,
ఛాతి నొప్పి,
అలసట, నీరసం
బరువు తగ్గడం

శ్వాసకోశ సంబంధిత సమస్యలు

తీవ్రమైన సందర్భాల్లో ఊపిరితిత్తులు, కాలేయం, ప్లీహం తదితర అంతర్గత అవయవాలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

బురద లేదా నిల్వ నీటిలో పనిచేసేటప్పుడు రబ్బరు బూట్లు ధరించాలి.
చేతులు, కాళ్లపై గాయాలు ఉంటే వాటిని కప్పి ఉంచాలి.
వ్యవసాయ పనుల అనంతరం చేతులు, కాళ్లను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.
పరిశుభ్రమైన తాగునీటినే వినియోగించాలి.
చెరువులు, కాలువలు, నిల్వ నీరు వంటి కలుషిత ప్రాంతాల్లో అనవసరంగా తిరగకూడదు.

ప్రజలకు విజ్ఞప్తి

వర్షాకాలంలో జ్వరం, దగ్గు, ఛాతి నొప్పి, అలసట వంటి లక్షణాలు రెండు రోజులకుపైగా కొనసాగితే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని డా. అఖీబ్ షరీఫ్ సూచించారు. సకాలంలో వైద్య చికిత్స తీసుకుంటే ఈ వ్యాధిని పూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు.
ప్రజల ఆరోగ్య రక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు కోరారు.