Home POLITICS సీఎం రేవంత్ రెడ్డి సభకు ఏర్పాట్లు ముమ్మరం

సీఎం రేవంత్ రెడ్డి సభకు ఏర్పాట్లు ముమ్మరం

44
0
  • సభా స్థలాలను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు, అధికారులు
  • భారీ జనసమీకరణకు అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచనలు

చింతకాని, జూన్ 17, ఆర్గాన్ న్యూస్:

ఈనెల 26న రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ . రేవంత్ రెడ్డి చింతకాని మండలంలో పాల్గొననున్న బహిరంగ సభ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. సభ నిర్వహణలో భాగంగా మంగళవారం లచ్చగూడెం, జగన్నాధపురం, రామకృష్ణాపురం గ్రామాల్లోని సభా స్థలాలను మండల కాంగ్రెస్ నాయకులు, సంబంధిత శాఖల అధికారులు కలిసి పరిశీలించారు.
సభ విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు. వేదిక నిర్మాణం, వాహనాల పార్కింగ్ సౌకర్యాలు, తాగునీటి ఏర్పాట్లు, విద్యుత్ సదుపాయాలు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా భద్రతా ప్రమాణాలు, పారిశుద్ధ్య నిర్వహణ, రవాణా సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచనలు చేశారు. సభను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సభా స్థల పరిశీలన కార్యక్రమంలో చింతకాని మండల కాంగ్రెస్ నాయకులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.