Home తెలంగాణ “మా అవసరం – మీ అదృష్టం” పేరుతో లక్కీ డ్రా…!

“మా అవసరం – మీ అదృష్టం” పేరుతో లక్కీ డ్రా…!

12
0
  • చెంజర్ల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన ప్రచారం
  • సోద్యం చూస్తున్న పోలీసులు మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 11:

కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో “మా అవసరం – మీ అదృష్టం” అనే పేరుతో నిర్వహిస్తున్న లక్కీ డ్రా కార్యక్రమం ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రూ.2500 టికెట్ కొనుగోలు చేస్తే రూ.25 లక్షల విలువ చేసే 4.22 గుంటల భూమిని బహుమతిగా ఇస్తామని నిర్వాహకులు సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
నిర్వాహకులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఒక్క టికెట్ ధర రూ.2500గా నిర్ణయించారు. ఈ టికెట్ కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రా ద్వారా పలు బహుమతులు ఇస్తామని పేర్కొన్నారు. మొదటి బహుమతిగా రూ.1 లక్ష, రెండో బహుమతిగా రూ.50 వేల చొప్పున బహుమతులు ఇస్తామని ప్రకటించారు. అలాగే ప్రధాన బహుమతిగా రూ.25 లక్షల విలువ చేసే 4.22 గుంటల స్థలాన్ని అందిస్తామని పేర్కొనడంతో కొంతమంది ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే టోకెన్లు విక్రయిస్తున్నామని ప్రచారం జరుగుతుండటంతో కొంతమంది టికెట్లు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహించడానికి ప్రభుత్వ అనుమతులు తీసుకున్నారా..? సంబంధిత అధికారుల నుంచి లైసెన్స్ పొందారా..? అనే అంశాలపై ఎలాంటి స్పష్టత లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా లాటరీలు లేదా బహుమతి పథకాలు నిర్వహించాలంటే సంబంధిత శాఖల అనుమతులు తప్పనిసరి. పోలీస్ శాఖ లేదా ఇతర సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చట్టపరంగా సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో లక్కీ డ్రా పేరుతో ప్రజల నుంచి డబ్బులు సేకరించి నిర్వాహకులు అదృశ్యమైన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మొదట ఆకర్షణీయమైన బహుమతులు ప్రకటించి ప్రజలను ఆకట్టుకొని తర్వాత డబ్బులతో పరారైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో చెంజర్ల గ్రామంలో జరుగుతున్న ఈ లక్కీ డ్రాపై కూడా కొంతమంది స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మానకొండూర్ మండలంతో పాటు పరిసర గ్రామాల వాట్సాప్ గ్రూపుల్లో ఈ ప్రకటన వైరల్ అవుతోంది. గ్రామాల వాట్సాప్ గ్రూపుల్లో విలేజ్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నప్పటికీ ఇప్పటివరకు పోలీసు శాఖ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదా హెచ్చరిక రాకపోవడం గమనార్హం. దీంతో ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం సైబర్ మోసాలు, ఆన్లైన్ మోసాల ద్వారా ప్రజలు లక్షల రూపాయలు నష్టపోతున్న ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు లక్కీ డ్రా పేరుతో డబ్బులు సేకరిస్తుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే కొంతమంది ప్రజలు రూ.2500 మాత్రమే కాబట్టి పోయినా పెద్ద నష్టం ఉండదన్న భావనతో టికెట్లు కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారని స్థానికులు చెబుతున్నారు.
అయితే సరైన అనుమతులు లేకుండా నిర్వహించే లక్కీ డ్రాల్లో పాల్గొంటే ప్రజలు మోసపోయే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు డబ్బులు కట్టి నష్టపోకముందే సంబంధిత అధికారులు దీనిపై స్పందించి లక్కీ డ్రా నిర్వహిస్తున్న నిర్వాహకులను విచారించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమానికి అవసరమైన అన్ని చట్టపరమైన అనుమతులు ఉన్నాయా లేదా అన్న విషయాన్ని స్పష్టంచేసి ప్రజలకు సమాచారం ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే అవసరమైతే పోలీసులు, రెవెన్యూ అధికారులు కలిసి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.