Home ఖమ్మం వరద విపత్తును ఎదుర్కొనేందుకు జిల్లా సిద్ధం !

వరద విపత్తును ఎదుర్కొనేందుకు జిల్లా సిద్ధం !

20
0
  • బొక్కలగడ్డలో విజయవంతంగా మాక్ డ్రిల్
  • జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం
  • ఎన్‌డీఎంఏ మార్గదర్శకాల్లో విపత్తుల నిర్వహణపై ప్రత్యక్ష అభ్యాసం

ఖమ్మం, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 22:

విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలను రక్షించడమే లక్ష్యంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.
జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎంఏ) ఆదేశాల మేరకు ఖమ్మం బొక్కలగడ్డ ప్రాంతంలో నిర్వహించిన వరద ప్రమాదాల మాక్ డ్రిల్‌ను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు.

మున్నేరు వరదల నేపథ్యంలో ప్రజలకు అవగాహన అత్యవసరం

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ,
గత రెండు సంవత్సరాలుగా మున్నేరు నదికి భారీ వరదలు రావడంతో ఖమ్మం నగర ప్రజలకు విపత్తులపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఎన్‌డీఎంఏ ఆధ్వర్యంలో విపత్తుల నిర్వహణపై మాక్ డ్రిల్ నిర్వహించామని చెప్పారు.

శాఖల మధ్య సమన్వయమే ప్రాణ రక్షణకు కీలకం

విపత్తు సంభవించినప్పుడు
వివిధ శాఖల మధ్య సమన్వయం ఎలా ఉండాలి,
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలి,
అవసరమైన పరికరాలు, వనరులు ఎలా సమకూర్చాలి
అన్న అంశాలపై పూర్తి స్థాయి అభ్యాసంతో ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు కలెక్టర్ వివరించారు.
పశుసంవర్ధక, విద్యుత్, మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక, మత్స్య శాఖల అధికారులు సమన్వయంతో విపత్తు సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యక్షంగా మాక్ డ్రిల్ నిర్వహించామని తెలిపారు.
దీని ద్వారా ఎక్కడైనా లోపాలు ఉంటే గుర్తించి సరిదిద్దుకునే అవకాశం లభిస్తుందని, మాక్ డ్రిల్ పూర్తిస్థాయిలో విజయవంతమైందని పేర్కొన్నారు.
మున్నేరు రిటైనింగ్ వాల్ పనులు జూన్ 2026 లోపు పూర్తి లక్ష్యం
గత వరదల సమయంలో ముందస్తు చర్యల కింద ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా నివారించగలిగామని కలెక్టర్ గుర్తు చేశారు.
మున్నేరు నదికి సంబంధించి జూన్ 2026 లోపు రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు.

వరదల్లో చిక్కుకున్న వారికి తక్షణ వైద్యం – ఆసుపత్రి మాక్ డ్రిల్

వరదల సమయంలో ఎవరైనా చిక్కుకుంటే,
వారిని ఎలా రక్షించాలి,
ఖమ్మం జనరల్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు ఎలా అందించాలి అనే అంశాలపై కూడా ప్రత్యేకంగా మాక్ డ్రిల్ నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు.

బొక్కలగడ్డ ముంపు సమాచారం – కంట్రోల్ రూమ్ అప్రమత్తత

వరదల కారణంగా బొక్కలగడ్డ ప్రాంతం ముంపుకు గురయ్యే అవకాశం ఉందన్న సమాచారంతో,
జిల్లా కంట్రోల్ రూమ్ తక్షణమే స్పందించి
సంబంధిత అధికారులను,
రెస్క్యూ బృందాలను అలర్ట్ చేయడంతో పాటు,
ఆపద మిత్ర వాలంటీర్ల సహకారంతో
ప్రజలను రామ్‌లీలా ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు తరలించారు.

రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ – ఎన్‌డీఎంఏ అధికారుల గమనింపు

రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో జరుగుతున్న మాక్ ఎక్సర్సైజ్‌లను
టీజీఐసిసిసి సంచాలకుల కార్యాలయం నుంచి జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ మేజర్ జనరల్ సుధీర్ బాల్ తదితర ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమంలో
ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ శ్రీనివాసాచారి, పబ్లిక్ హెల్త్ ఎస్‌ఈ రంజిత్, జిల్లా అగ్నిమాపక అధికారి అజయ్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా ఇరిగేషన్ అధికారి వెంకట్రాం, ఏదులాపురం మునిసిపల్ కమిషనర్ శ్రీనివాస రెడ్డి, ఖమ్మం మునిసిపల్ సహాయ కమిషనర్ అనిల్ కుమార్, ఖమ్మం రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్ తదితర అధికారులు పాల్గొన్నారు.