Home క్రైమ్ విద్యుత్ షాక్‌తో లైన్‌మన్ కు తీవ్ర గాయాలు

విద్యుత్ షాక్‌తో లైన్‌మన్ కు తీవ్ర గాయాలు

23
0

కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 25:

విధి నిర్వహణలో భాగంగా విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్‌కు గురై మున్సిపల్ లైన్‌మన్ శివకృష్ణ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన అలుగునూరు ప్రాంతంలో చోటుచేసుకుంది. బొమ్మకల్‌కు చెందిన శివకృష్ణను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మేయర్ కొలగని శ్రీనివాస్ ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నప్పటికీ వారికి తగిన భద్రతా పరికరాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. లైన్‌మన్‌లకు ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోవడం బాధాకరమన్నారు.
మున్సిపల్ కార్మికులకు తక్షణమే సేఫ్టీ కిట్లు, గ్లవ్స్, హెల్మెట్లు వంటి రక్షణ పరికరాలు అందించడంతో పాటు ప్రతి కార్మికుడికి సమగ్ర బీమా సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో ప్రమాదాలకు గురైన వారికి తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రమాదాల వల్ల పేద కార్మిక కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని పేర్కొంటూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. గాయపడిన శివకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.