Home POLITICS తెలంగాణలో పోలీసులకు ‘స్వీట్ వార్నింగ్స్’

తెలంగాణలో పోలీసులకు ‘స్వీట్ వార్నింగ్స్’

17
0
  • చట్టాన్ని కాపాడండి… లేదంటే పోస్టింగ్‌లు కష్టమే!
  • అధికార–విపక్షాల హెచ్చరికల మధ్య సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్,ఆర్గాన్ న్యూస్,మార్చి 10:

తెలంగాణలో పోలీసు వ్యవస్థపై అధికార, విపక్ష పార్టీల నుంచి వరుసగా వస్తున్న ‘స్వీట్ వార్నింగ్స్’ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలి కానీ రాజకీయ ఒత్తిళ్లకు లోనవ్వకూడదని, ఒకవేళ విధుల్లో నిర్లక్ష్యం లేదా చట్టాన్ని తుంగలో తొక్కే చర్యలు జరిగితే పోస్టింగులు కూడా ప్రమాదంలో పడతాయని నేతలు స్పష్టం చేస్తున్నారు.

ఇటీవల జరిగిన పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పోలీసు అధికారుల పనితీరు, విధుల నిర్వహణపై ప్రభుత్వం కచ్చితమైన నిఘా ఉంచుతోందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని పోలీసు అధికారుల ప్రొఫైల్స్ అన్నీ తన వద్ద ఉన్నాయని చెప్పారు. అధికారుల పనితీరును పరిశీలించి వారిని మూడు విభాగాలుగా విభజించుకున్నామని, ఆ వివరాల ఆధారంగానే బాధ్యతలు, పోస్టింగులు నిర్ణయిస్తామని వెల్లడించారు.

పోలీసుల బదిలీలు, పోస్టింగ్‌ల విషయంలో పైరవీలు లేదా రాజకీయ జోక్యం ఉండదని సీఎం స్పష్టం చేశారు. ప్రతి అధికారికి సంబంధించిన పూర్తి డేటా ప్రభుత్వ వద్ద ఉందని, ఆ డేటాను ఆధారంగా తీసుకుని పోస్టింగులు ఇవ్వబడతాయని తెలిపారు.

అదే సమయంలో పోలీసుల పనితీరు కూడా పారదర్శకంగా ఉండాలని సీఎం సూచించారు. కేసుల నిర్వహణ, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు కచ్చితమైన డేటా నిర్వహణ చేయాలని, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని చెప్పారు.

విధుల్లో నిర్లక్ష్యం చూపే వారు లేదా చట్టాన్ని సరిగా అమలు చేయని వారు మంచి పోస్టింగులు ఆశించవద్దని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం విశేషం. ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో పోలీసు వ్యవస్థపై క్రమశిక్షణ పెంపుకు సంకేతంగా భావిస్తున్నారు.

ఇక మరోవైపు అధికార, విపక్ష పార్టీల నాయకులు కూడా పోలీసులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చట్టాన్ని పక్కనబెట్టి ఎవరికైనా అనుకూలంగా వ్యవహరించే ప్రయత్నాలు చేస్తే భవిష్యత్తులో కఠిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు.

మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో పోలీసుల పాత్ర, బాధ్యతలపై చర్చ మళ్లీ తెరపైకి రావడంతో ఈ ‘స్వీట్ వార్నింగ్స్’ రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.