Home Uncategorized లోక్ అదాలత్ ఒక సువర్ణావకాశం

లోక్ అదాలత్ ఒక సువర్ణావకాశం

27
0
  • కేసుల పరిష్కారానికి రాజీ మార్గమే – రాజ మార్గం
  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్

కొత్తగూడెం ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్ , మార్చి 28:

కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ ఉత్తమ వేదికగా నిలుస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ తెలిపారు.
జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “రాజీ మార్గమే రాజమార్గం” అని పేర్కొన్నారు. రాజీ ద్వారా కేసులను పరిష్కరించుకోవడం వల్ల ఇరుపక్షాలు స్నేహపూర్వక వాతావరణంలో సమస్యలను ముగించుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు.
సివిల్ కేసులు, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులు, మెయింటెనెన్స్ కేసులు, బ్యాంక్ రికవరీ కేసులు, మోటార్ వాహన ప్రమాద బీమా కేసులను పరస్పర అంగీకారంతో రాజీ పడాలని సూచించారు. లోక్ అదాలత్ ద్వారా కేసు పరిష్కారమైతే కోర్టు ఫీజు తిరిగి చెల్లించబడుతుందని, దీని ద్వారా సమయం, ఖర్చు రెండూ ఆదా అవుతాయని వివరించారు.
లోక్ అదాలత్ తీర్పు సివిల్ కోర్టు డిక్రీతో సమానమని, దీనిపై అప్పీల్‌కు అవకాశం ఉండదని స్పష్టం చేశారు. కేసుల పరిష్కారంతో ఇరుపక్షాల మధ్య శత్రుత్వం తొలగి సఖ్యత పెరుగుతుందని తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 బెంచీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కక్షిదారులకు ఎస్బీఐ బ్యాంక్ సౌజన్యంతో పులిహార, మంచినీళ్లు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్. సరితా, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, మెజిస్ట్రేట్లు సుచరిత, బత్తుల రవికుమార్, వినయ్ కుమార్, సాయి శ్రీ, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.