Home Uncategorized బిడ్డలకు భూమి రాసిచ్చిన అవ్వకు బువ్వ కూడా దొరకని దుస్థితి

బిడ్డలకు భూమి రాసిచ్చిన అవ్వకు బువ్వ కూడా దొరకని దుస్థితి

13
0
  • తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో ఘటన మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 9:

తమకున్న భూమిని నమ్మి బిడ్డకు రాసిచ్చిన ఓ వృద్ధురాలు ప్రస్తుతం బువ్వ కూడా దొరకని దుస్థితిలో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీలో సోమవారం చోటుచేసుకుంది.
గ్రామస్తుల కథనం ప్రకారం.. రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన మచ్చిగాని అలియాస్ అలువాల ఎల్లవ్వ, మల్లయ్య దంపతులకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. కొంతకాలం క్రితం మల్లయ్య మృతి చెందగా, ఎల్లవ్వను పోషిస్తానని చెప్పిన ఒక కుమార్తె, దంపతులకు ఉన్న రెండు గుంటల భూమిని తన పేరుమీద రాయించుకుంది.
అయితే ప్రస్తుతం ఎల్లవ్వను నిర్లక్ష్యం చేయడంతో ఆమె చీమలకుంటపల్లి గ్రామంలో నివసిస్తున్న మరో కుమార్తె వద్ద ఉంటోంది. తనను పోషిస్తానని చెప్పి భూమి రాయించుకున్నారని, కానీ ఇప్పుడు తనకు బువ్వ కూడా పెట్టడం లేదని, ఆ భూమిని తిరిగి తనకు ఇప్పించాలని ఎల్లవ్వ సోమవారం ఎల్ఎండీ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది.
నడవలేని స్థితిలో ఉన్న ఎల్లవ్వ వద్దకు ఎస్సై సయ్యద్ అన్వర్ చేరుకుని ఆమె బాధలను విన్నారు. ఈ విషయంపై తాను న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన ఎస్సై, తహశీల్దార్ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేయాలని సూచించారు.
ప్లాస్టిక్ స్టూలు పట్టుకొని వంగి ఈడ్చుకుంటూ స్టేషన్‌కు వచ్చిన ఎల్లవ్వను చూసిన వారు “అయ్యో అవ్వా.. ఐదుగురు బిడ్డలు ఉండి బుక్కెడు బువ్వకే తిప్పలైందా” అంటూ విచారం వ్యక్తం చేశారు.