Home తెలంగాణ యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి

22
0
  • 700 మంది భూనిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలి
  • నల్లమోతు భాస్కర్‌రావు

మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, జూన్ 12:

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, పెండింగ్‌లో ఉన్న 700 మంది భూనిర్వాసిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు డిమాండ్ చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో సుమారు రూ.30 వేల కోట్ల వ్యయంతో ఏర్పాటైన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే కీలక ప్రాజెక్టు అని ఆయన పేర్కొన్నారు. అలాంటి ప్రజాప్రయోజన ప్రాజెక్టును ప్రైవేటు సంస్థలకు అప్పగించడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన రైతులు, గిరిజనులు తమ కుటుంబాలకు ఉద్యోగాలు లభిస్తాయనే నమ్మకంతో సహకరించారని గుర్తు చేశారు. ఇప్పటికీ వందలాది భూనిర్వాసిత కుటుంబాలు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తుండగా, ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు. ప్రైవేటీకరణ వల్ల స్థానిక యువత ఉపాధి అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పేర్కొన్న ఆయన, ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃపరిశీలించి అర్హులందరికీ న్యాయం చేయాలని కోరారు. ప్రజల హక్కులకు భంగం కలిగితే బీఆర్ఎస్ ప్రజలతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.