Home తెలంగాణ నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్‌ – రిజిస్ట్రేషన్ లేకుంటే కేసులు

నిబంధనలు ఉల్లంఘిస్తే సీజ్‌ – రిజిస్ట్రేషన్ లేకుంటే కేసులు

19
0
  • శస్త్రచికిత్సలు, కాన్పులపై ప్రత్యేక నిఘా
  • డీఎంహెచ్ఓ డా. వెంకటరమణ కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 19:

కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులపై వైద్య ఆరోగ్యశాఖ కొరడా ఝళిపించింది. నిబంధనలు పాటించని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ హెచ్చరించారు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ రిజిస్ట్రేషన్ అథారిటీ బృందం ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు, నర్సింగ్ హోములు, అల్ట్రాసౌండ్ కేంద్రాలపై అకస్మిక తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో భాగంగా ఆస్పత్రుల్లో నిర్వహిస్తున్న రిజిస్టర్లు, రోగుల అనుమతి పత్రాలు, కేసు రికార్డులు, చికిత్స వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం–2010, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిషేధ చట్టం–1994 నిబంధనలు తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టం చేశారు. ఎక్కడైనా ఉల్లంఘనలు గుర్తిస్తే కఠిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
జిల్లాలోని అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు అధికారికంగా నమోదు చేసుకుని ఉండాలని, రిజిస్ట్రేషన్ లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తే సీజ్ చర్యలు తప్పవని తెలిపారు. వైద్యుల అర్హత సర్టిఫికెట్లు, స్పెషలిస్టుల ధృవపత్రాలు, రిజిస్ట్రేషన్ పత్రాలు, పరిశుభ్రత ప్రమాణాలను కూడా బృందం పరిశీలించింది.
ప్రత్యేకంగా శస్త్రచికిత్స కాన్పులపై దృష్టి సారించిన అధికారులు, అవసరం లేకుండా సిజేరియన్ ఆపరేషన్లు చేయవద్దని హెచ్చరించారు. గర్భిణీలకు సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని సూచించారు. జిల్లాలో ఇలాంటి తనిఖీలు ఇకపై నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధ, పీఓ డీటీటీ డాక్టర్ ఉమాశ్రీ, పీఓ ఎంహెచ్ఎన్ డాక్టర్ సనజవేరియా, బాలయ్య, ఇజాక్ తదితరులు పాల్గొన్నారు.