Home ఎడ్యుకేషన్ తనుగుల గ్రామంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలు

తనుగుల గ్రామంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలు

20
0
  • ముఖ్య అతిథిగా హాజరై నివాళులు అర్పించిన జక్కే వీరస్వామిగౌడ్ కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, జనవరి 3:

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల గ్రామ పంచాయితీ ఆవరణలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి ఉత్సవాలను గ్రామ సర్పంచ్ జక్కే కిరణ్ గౌడ్ అధ్యక్షతన పాలకవర్గం ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా సర్పంచ్ జక్కే కిరణ్ గౌడ్ మాట్లాడుతూ, మహిళలకు సమాన హక్కులు, సమాన న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. మహిళా విద్యకు పునాది వేసిన ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సర్వాయి పాపన్న, మోకుదెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కే వీరస్వామిగౌడ్ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం జక్కే వీరస్వామిగౌడ్ మాట్లాడుతూ, ఆడపిల్లలకు చదువు వద్దు అన్న కాలంలో తానే చదువుకొని, దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా నిలిచిన గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే అని తెలిపారు. మహారాష్ట్రలోని పూణే పట్టణంలో 19 బాలికల పాఠశాలలను స్థాపించి వందలాది మంది బాలికలకు విద్యను అందించిన ఆమె ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయురాలని అన్నారు.
1831 జనవరి 3న జన్మించిన సావిత్రిబాయి పూలే, సామాజిక సేవ చేస్తూనే పూణేలో ప్లేగు వ్యాధి బాధితులను ఆదుకుంటూ 1897 మార్చి 10న ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఆమె ఆశయాలను ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన నివాళి అవుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ అంబాల స్వప్న రజనీకాంత్, గ్రామ కార్యదర్శి శ్రీకాంత్, వార్డు సభ్యులు పైడిపల్లి వెంకటేష్, కీర్తన కుమారస్వామి, దాసరి రామకృష్ణ, వాసాల రాజు, తాళ్లపెళ్లి రాములు గౌడ్, జక్కే చిరంజీవి, జక్కే ప్రణయ్, దోనికల అనిల్, అంగన్వాడీ టీచర్లు అంబటి పద్మ, జైద సువర్ణ, ఆశ వర్కర్ గోల్లేని దీపిక తదితరులు పాల్గొని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.