Home ఖమ్మం గ్రామాల నుంచి డ్రగ్స్‌పై యుద్ధం

గ్రామాల నుంచి డ్రగ్స్‌పై యుద్ధం

32
0
  • యువతే మార్పుకు నాయకులు కావాలి
  • ఈగల్ ఫోర్స్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు
    తిరుమలాయపాలెం,ఆర్గాన్ న్యూస్,మార్చి 24:

మాదకద్రవ్యాల బారిన పడుతున్న యువతను రక్షించేందుకు గ్రామ స్థాయిలోనే అవగాహన యుద్ధం ప్రారంభమైంది. డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని ఈగల్ ఫోర్స్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
మండల పరిధిలోని సుబ్లేడు, పిండిప్రోలు, బీరోలు, తిరుమలాయపాలెం గ్రామాల హైస్కూల్లలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.

మత్తు బారిన యువత … గ్రామాల్లోనే చైతన్య యాత్ర

రోజురోజుకీ యువత మాదకద్రవ్యాల వైపు ఆకర్షితులవుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని శ్రీనివాసరావు తెలిపారు. డ్రగ్స్ నిర్మూలన కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ ఫోర్స్ ద్వారా విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం జరుగుతోందన్నారు.
విద్యార్థులే సమాజ మార్పుకు దారితీస్తారని, డ్రగ్స్‌కు దూరంగా ఉండి ఇతరులను కూడా దూరంగా ఉంచే బాధ్యత తీసుకోవాలని సూచించారు.

ఒక విద్యార్థి తప్పుదోవ పట్టినా… కుటుంబం మొత్తం నష్టపోతుంది

సుబ్లేడు గ్రామంలో సర్పంచ్ సంగబత్తుల స్వాతి సుమన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు.
పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వారి చదువు, ప్రవర్తనపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఒక విద్యార్థి డ్రగ్స్ అలవాటు పడితే అతని కుటుంబం, భవిష్యత్తు ఎలా దెబ్బతింటుందో స్పష్టంగా వివరించారు.

“డ్రగ్స్‌కు నో… భవిష్యత్తుకు యెస్” – విద్యార్థులకు పిలుపు

ప్రతి విద్యార్థి కష్టపడి చదివి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
“డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతి గ్రామం, ప్రతి విద్యార్థి ముందుకు వస్తేనే సమాజం సురక్షితం” అనే సందేశంతో తిరుమలాయపాలెం మండలం ముందడుగు వేస్తోంది.