Home agriculture యూరియా వాడకంపై రైతులు అపోహలు వీడాలి

యూరియా వాడకంపై రైతులు అపోహలు వీడాలి

13
0
  • ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 21:

యూరియా అధికంగా వాడితే అధిక దిగుబడి వస్తుందనే అపోహలను రైతులు వెంటనే వీడి, శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. శనివారం మానకొండూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో 90 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మోతాదుకు మించి యూరియా వాడటం వల్ల పంట దిగుబడి పెరగకపోగా, మొక్కలు బలహీనంగా మారి నాణ్యత తగ్గుతుందని స్పష్టం చేశారు. అధిక యూరియా వినియోగం భూమి సారాన్ని దెబ్బతీసే ప్రమాదముండటమే కాకుండా, ప్రజారోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు.
యూరియా వాడకంపై రైతుల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, ప్రత్యామ్నాయ సేంద్రీయ ఎరువుల వినియోగంపై వ్యవసాయశాఖ చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. యూరియా సమస్య జిల్లా లేదా నియోజకవర్గ స్థాయిలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నదని పేర్కొన్నారు.
కొంతమంది కావాలనే యూరియాకు కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ, అలాంటి ప్రచారాలకు రైతులు లోనుకాకూడదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మానకొండూర్ మండలానికి తొలి విడతలో 850 ఇళ్లు మంజూరయ్యాయని, అందులో 90 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. త్వరలో గృహప్రవేశాలకు ఇళ్లు సిద్ధం కానున్నాయని వెల్లడించారు.
మానకొండూర్ మండలానికి 23వ విడత కింద 90 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ.23,95,500 మంజూరు కాగా, ఆ మొత్తాన్ని చెక్కుల రూపంలో అందజేశామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వీవీ వరలక్ష్మి, ఇంచార్జీ తహసీల్దార్ నరేందర్, ఎంపీవో సతీష్ రావు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నందగిరి రవీంద్రచారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్, వైస్ చైర్మన్ ఆర్. తిరుమల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సంపత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.