- గడువు ముగిసిన మందుల ఆరోపణలు
- 6 నెలల శిశువు మృతి
రంగారెడ్డి ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 21:
బండ్లగూడ జాగీర్ – సన్ సిటీ పరిధిలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రాము అనే ఆరు నెలల బాబుకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం, అక్కడి వైద్యులు గడువు ముగిసిన మందులు ఇచ్చినట్లు తెలిపారు. మందులు ఇచ్చిన కొద్దిసేపటికే బాబు ఆరోగ్యం విషమించగా, వెంటనే చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా మృతి చెందినట్లు సమాచారం.
బాలుడు ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులచే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.


