Home agriculture యాప్ బుకింగ్ సమస్యలతో రైతుల ఆవేదన

యాప్ బుకింగ్ సమస్యలతో రైతుల ఆవేదన

26
0

మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, ఫిబ్రవరి 21:

మిర్యాలగూడ నియోజకవర్గం వేములపల్లి మండల కేంద్రంలో యూరియా సరఫరా సమస్యపై రైతులు శనివారం తీవ్ర ఆందోళనకు దిగారు. పాత విధానంలోనే యూరియా పంపిణీ చేయాలని, ఇటీవల అమలు చేస్తున్న యాప్ బుకింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయం ఎదుట నార్కెట్‌పల్లి–అద్దంకి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. యాప్ ద్వారా ముందస్తు బుకింగ్ తప్పనిసరి చేయడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు తెలిపారు. బుకింగ్ కోసం స్మార్ట్‌ఫోన్ అవసరమవుతుండగా, తమలో చాలా మందికి స్మార్ట్‌ఫోన్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యల కారణంగా యాప్ సరిగా పనిచేయడం లేదని కూడా పేర్కొన్నారు. సరైన అవగాహన, సాంకేతిక సహాయం లేకుండానే డిజిటల్ విధానం అమలు చేయడం వల్ల రైతులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పాత విధానాన్ని పునరుద్ధరించి, మండలానికి సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఏవో కిషోర్ నాయక్, ఏఈఓ నితిన్, ఎస్ఐ వెంకటేశ్వర్లు ఘటనాస్థలానికి చేరుకుని రైతులతో చర్చించారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ధర్నా కారణంగా కొంతసేపు రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.