Home తెలంగాణ ప్రజా భవన్ ముట్టడించిన తెలంగాణ ఉద్యమకారులు

ప్రజా భవన్ ముట్టడించిన తెలంగాణ ఉద్యమకారులు

18
0
  • ఎన్నికల హామీలు వెంటనే అమలు చేయాలని ప్రభుత్వానికి గట్టిపలుకులు
  • ప్రభుత్వం సానుకూల స్పందన.. వారం రోజుల్లో కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ
  • అక్రమ అరెస్టుల మధ్య భారీగా తరలివచ్చిన ఉద్యమకారులు
  • జూన్ 2లోపు స్పష్టమైన నిర్ణయం లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు హెచ్చరిక

ఆర్గాన్ న్యూస్, ఖమ్మం/హైదరాబాద్:

తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు హైదరాబాద్‌లోని ప్రజా భవన్ ముందు భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ఓరుగంటి ఆనంద్ పిలుపుమేరకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యమకారులు తరలివచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు.
ప్రభుత్వం పలు జిల్లాల్లో ఉద్యమకారులను అక్రమంగా అరెస్టు చేసి అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ, పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రజా భవన్ వద్దకు చేరుకుని నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారికి ఇప్పటివరకు సరైన గుర్తింపు, హామీల అమలు జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులతో కీలక చర్చలు

నిరసన తీవ్రతరం కావడంతో పోలీసు అధికారులు ఉద్యమకారుల ప్రతినిధులను ప్రజాపాలన కార్యక్రమంలో వినతిపత్రాలు స్వీకరిస్తున్న అధికారి చిన్నారెడ్డి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నుంచి సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రికి లేఖ పంపించారు.
తర్వాత పోలీసులు ఉద్యమకారుల ప్రతినిధులను తమ వాహనంలో సచివాలయానికి తీసుకెళ్లి సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రితో భేటీ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉద్యమకారుల సమస్యలను శేషాద్రి ఓపికగా విని చర్చలు జరిపినట్లు సమాచారం.

సీఎం దృష్టికి సమస్య.. కమిటీ ఏర్పాటుకు హామీ

ఉద్యమకారుల సమస్య ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టిలో ఉందని అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. వారం రోజులలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కెవి కృష్ణారావు వెల్లడించారు.
ఉద్యమకారులు మాట్లాడుతూ జూన్ 2లోపు స్పష్టమైన గుర్తింపు కమిటీ ఏర్పాటు చేసి ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ పసుపులేటి నాసరయ్యతో పాటు బచ్చల పద్మాచారి, కేలోత్ రవిచంద్ర చౌహాన్, మొతుకురి వెంకటాచారి, గాజుల రవికుమార్, ఉపేందర్, రెడ్డబోయిన వరలక్ష్మి, కామని అనంతలక్ష్మి, నల్లా స్వరూప, ధనలక్ష్మి, కమలమ్మ, ఆకారపు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.