Home ఎడ్యుకేషన్ విద్యార్థినీలతో కలిసి ఉప ముఖ్యమంత్రి భోజనం

విద్యార్థినీలతో కలిసి ఉప ముఖ్యమంత్రి భోజనం

27
0
  • భవిష్యత్తుకు భరోసా ఇస్తూ హామీ ఇచ్చిన భట్టి విక్రమార్క
  • మొగిలిగిద్ద కస్తూర్బా గాంధీ బాలికల వసతిగృహాన్ని ఆకస్మికంగా సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

మొగిలిగిద్ద | ఆర్గాన్ న్యూస్, జనవరి 31:

ప్రభుత్వం మాటల్లోనే కాదు, చేతల్లోనూ విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించారు డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. మొగిలిగిద్దలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతిగృహాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి, విద్యార్థినీలతో కలిసి భోజనం చేస్తూ వారి విద్య, వసతి, భోజన సౌకర్యాలపై నేరుగా సమాచారం తెలుసుకున్నారు.
వసతిగృహంలో నివసిస్తున్న విద్యార్థినీలతో స్నేహపూర్వకంగా మమేకమై వారి సమస్యలు, అవసరాలు, ఆశయాలను డిప్యూటీ సీఎం అడిగి తెలుసుకున్నారు. భోజనం నాణ్యత, వసతి గదులు, పరిశుభ్రత, విద్యా బోధన వంటి అంశాలపై విద్యార్థినీల అభిప్రాయాలను స్వయంగా వినిపించుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా భయపడకుండా చెప్పాలని సూచిస్తూ, ప్రభుత్వం మీ వెంటే ఉందని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, బాలికల విద్యే రాష్ట్ర భవిష్యత్తు అని స్పష్టం చేశారు. పేద, గ్రామీణ ప్రాంతాల బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, భోజన సౌకర్యాలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. కస్తూర్బా గాంధీ వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థినీలు ధైర్యంగా ముందుకు సాగాలని, వారి ఉన్నత చదువులకు, భవిష్యత్తు కలలకు ప్రభుత్వం పూర్తిగా తోడుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
విద్యార్థినీలతో కలిసి భోజనం చేయడం ద్వారా వారి జీవన పరిస్థితులను అర్థం చేసుకోవడమే కాకుండా, పాలన ప్రజలకు ఎంత దగ్గరగా ఉందో ఈ సందర్శన స్పష్టంగా చూపిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పెద్దల నుంచి ఇలాంటి మానవీయ స్పందన రావడం తమకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోందని విద్యార్థినీలు ఆనందం వ్యక్తం చేశారు.
డిప్యూటీ సీఎం ఆకస్మిక తనిఖీతో వసతిగృహ సిబ్బంది అప్రమత్తమయ్యారు. వసతిగృహాల్లో విద్యార్థినీలకు అన్ని సౌకర్యాలు సమర్థవంతంగా అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు.