Home agriculture మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలి

మొక్కజొన్న కొనుగోళ్లలో వేగం పెంచాలి

20
0
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • కేంద్రం కొనుగోలు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వం రూ.4,000 కోట్లతో మొక్కజొన్న సేకరణ చేపట్టింది
  • జొన్న కొనుగోలుకు రూ.1100 కోట్లతో ప్రభుత్వం సిద్ధంగా ఉంది
  • మొక్కజొన్న, జొన్నలను వెంటనే పీఎస్‌ఎస్ (PSS) పరిధిలోకి తీసుకురావాలి
  • పిఎస్ఎస్ స్కీంలో ఉన్న శనగ, పొద్దుతిరుగుడు పంటలపై 25శాతం సీలింగ్ పరిమతిని 50 శాతంకు వెంటనే పెంచాలని మంత్రి డిమాండ్
  • అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్న కేంద్రం నుంచి ఎటువంటి సమాధానం లేదని విమర్శించిన మంత్రి తుమ్మల
  • హైదరాబాద్ ఆర్గాన్ న్యూస్ :

రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోళ్లను వేగవంతం చేసి, రైతులు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత & జౌళి శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మొక్కజొన్న కొనుగోళ్లు, నిల్వ సౌకర్యాలు, గన్ని బ్యాగుల లభ్యత, రవాణా ఏర్పాట్లు, కేంద్ర ప్రభుత్వ విధానాలపై సమగ్రంగా చర్చించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు రైతుల నుండి 9.57 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న సేకరించినట్లు మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా, ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం స్వంత నిధులతో రూ.4,000 కోట్ల వ్యయంతో మొక్కజొన్న కొనుగోలు చేపట్టిందన్నారు. అదేవిధంగా, రాష్ట్రంలో సాగవుతున్న జొన్న పంటను కూడా రూ.1,000 కోట్లతో సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు.

సేకరించిన మొక్కజొన్న నిల్వ కోసం మొత్తం 15.07 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములు అవసరమవుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11.40 లక్షల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యం మాత్రమే అందుబాటులో ఉందని, దీంతో ఇంకా 3.29 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు నిల్వ సామర్థ్యం అత్యవసరంగా అవసరమని పేర్కొన్నారు. ఈ మేరకు అదనపు గోదాములను వెంటనే గుర్తించి, అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.

మొక్కజొన్న కొనుగోళ్ల కోసం మొత్తం 3 కోట్ల గన్ని బ్యాగులు అవసరమవుతుండగా, ఇప్పటివరకు 2 కోట్ల గన్ని బ్యాగులు సరఫరా చేసినట్లు తెలిపారు. మిగిలిన ఒక కోటి గన్ని బ్యాగులు వెంటనే అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో అప్‌లోడింగ్ పాయింట్ల వద్ద హమాలీల కొరత లేకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. రైతులు తీసుకొచ్చిన పంటను ఆలస్యం లేకుండా బరువు తూచి, గోదాములకు తరలించేందుకు తగిన సంఖ్యలో లారీలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల నుండి గోదాములకు పంట తరలింపులో ఎటువంటి ఆటంకాలు లేకుండా సమన్వయంతో పనిచేయాలని వ్యవసాయ, మార్కెటింగ్ అధికారులకు సూచించారు.
మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర ప్రభుత్వ ధర మద్దతు పథకం (Price Support Scheme – PSS) పరిధిలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నా కేంద్రం స్పందించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

ప్రస్తుతం పీఎస్‌ఎస్ పరిధిలో ఉన్న శనగ, పొద్దుతిరుగుడు పంటల కొనుగోలుపై అమలులో ఉన్న 25 శాతం సీలింగ్‌ను వెంటనే 50 శాతానికి పెంచాలని మంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ మంత్రికి మరోసారి లేఖ రాస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర రైతుల సమస్యలను కేంద్ర దృష్టికి తీసుకెళ్లి, శనగ, పొద్దుతిరుగుడు కొనుగోలు పరిమితిని 50 శాతానికి పెంచించడంతో పాటు, మొక్కజొన్న, జొన్నలను పీఎస్‌ఎస్‌లో చేర్చేలా కృషి చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడం, వారి కష్టానికి తగిన ప్రతిఫలం అందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆ బాధ్యతల నుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకుని పనిచేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రైతు సంక్షేమమే పరమావధిగా రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు.