Home POLITICS పతకాలే లక్ష్యంగా విద్యార్థులకు క్రీడల్లో తర్ఫీదు

పతకాలే లక్ష్యంగా విద్యార్థులకు క్రీడల్లో తర్ఫీదు

17
0
  • రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, డిసెంబర్ 27:

జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో తెలంగాణ విద్యార్థులు పతకాలు సాధించే స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించిందని బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. శనివారం అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించేలా విద్యార్థులకు క్రీడా నైపుణ్యాలు, శిక్షణ అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. భవిష్యత్తులో జరిగే అన్ని రకాల క్రీడా పోటీల్లో తెలంగాణ విద్యార్థుల ప్రాతినిధ్యం ఉండేలా చర్యలు తీసుకుంటామని, క్రీడల వైపు విద్యార్థులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నిత్య జీవితంలో క్రీడలు భాగం కావాలని, విద్యార్థులే కాకుండా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొని వ్యాయామ అలవాట్లు కొనసాగించాలని సూచించారు. క్రీడల నిర్వహణకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎప్పటికీ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఆనందానికి, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని అన్నారు. క్రీడాకారుల్లో మానసిక పరిపక్వత, మనోధైర్యం మెండుగా ఉంటుందని పేర్కొన్నారు. క్రీడల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. అథ్లెటిక్స్ పోటీల నిర్వాహకులను ఆయన అభినందించారు.
మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు ఎంతో అవసరమన్నారు. క్రీడలు అనేక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయని, ‘ఆరోగ్యం మహాభాగ్యం’ అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తోందన్నారు. అందులో భాగంగానే క్రీడలను, క్రీడాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు. మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల నిర్వాహకులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాస్టర్ అథ్లెటిక్స్ రాష్ట్ర అధ్యక్షుడు మర్రి లక్ష్మారెడ్డి, జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్, అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్‌తో పాటు పద్మాదేవేందర్, సిద్ధారెడ్డి, లక్ష్మణ్, వరాల జ్యోతి తదితరులు పాల్గొన్నారు.