- జిల్లా స్థాయి మెగా రైతు మేళాలో రైతులకు మంత్రి సీతక్క పిలుపు
- పంటల మార్పిడి, సేంద్రియ సాగుతో అధిక దిగుబడులు సాధించాలి
- రైతు సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
ములుగు, జూన్ 11 (ఆర్గాన్ న్యూస్):
రైతులు సంప్రదాయ వ్యవసాయంతో పాటు ఆధునిక సాగు పద్ధతులను అవలంబించి అధిక లాభాలు సాధించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పిలుపునిచ్చారు. పంటల మార్పిడి, సేంద్రియ వ్యవసాయం, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందవచ్చని ఆమె పేర్కొన్నారు.
గోవిందరావుపేట మండలం సోమలగడ్డ క్రాస్ వద్ద పీఎస్‌ఆర్ గార్డెన్‌లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి మెగా రైతు మేళాకు మంత్రి సీతక్క, జంగా రాఘవరెడ్డి, బోర్ఖడే హేమంత్ సహదేవరావులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో వ్యవసాయ శాస్త్రవేత్తలు పంటల మార్పిడి విధానం, నూతన వంగడాల వినియోగం, సేంద్రియ వ్యవసాయం, ఆధునిక యంత్రాల వినియోగం, తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే శాస్త్రీయ పద్ధతులపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, పంటల మార్పిడి ద్వారా భూసారాన్ని కాపాడుకుంటూ అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు అందిస్తున్న సాంకేతిక సూచనలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, క్వింటాలుకు బోనస్ వంటి పథకాల ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ములుగు జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తరిస్తుండటం సంతోషకరమని పేర్కొన్న మంత్రి, తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం అందించే పంటగా రైతులు దీనిని స్వీకరించాలని సూచించారు. పోడు, బీడు భూముల్లో కూడా ఆయిల్ పామ్‌తో పాటు ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను సాగు చేసి ఆదాయం పెంచుకోవాలని సూచించారు.
అనంతరం వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, మత్స్య మరియు అనుబంధ రంగాలకు సంబంధించిన ప్రదర్శన స్టాల్స్‌ను సందర్శించి రైతులతో ముచ్చటించారు. నూతన వరి నాటు యంత్రాన్ని స్వయంగా నడిపి దాని పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో ఉత్తమ రైతులను సన్మానించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో బానోతు రవిచందర్, రేగ కళ్యాణి, వ్యవసాయ శాస్త్రవేత్తలు, జిల్లా అధికారులు, రైతు ప్రతినిధులు, ఆత్మ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
“సాంకేతికతతో సాగు – సేంద్రియతతో ఆరోగ్యం – మార్కెట్‌కు అనుగుణంగా పంటల ఎంపిక” అనే సందేశంతో నిర్వహించిన ఈ మెగా రైతు మేళా రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.









