Home తెలంగాణ ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా గమ్యం చేరాలి

ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా గమ్యం చేరాలి

22
0
  • వైరా ఏసీపీ సారంగపాణి

చింతకాని,ఆర్గాన్ న్యూస్,మార్చి 28:

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యం చేరాలని వైరా ఏసీపీ సారంగపాణి సూచించారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రాణనష్టాన్ని నివారించేందుకు పోలీస్ శాఖ చేపట్టిన మూడో విడత “అరైవ్ అలైవ్” ప్రత్యేక కార్యక్రమం చింతకాని మండలం పందిళ్లపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, స్థానిక ప్రజలు, వాహన డ్రైవర్లకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా అఖిల కంటి ఆసుపత్రి వైద్య బృందం ద్వారా వాహన డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటిస్తూ బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని ప్రజలకు సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాలు, మరణాలను తగ్గించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
హెల్మెట్ ధరించకపోవడం, సీటు బెల్ట్ వినియోగించకపోవడం, వాహనం నడుపుతూ సెల్‌ఫోన్ ఉపయోగించడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, సిగ్నల్ జంప్ చేయడం, స్టాప్ లైన్ దాటడం, హైవేలపై ఆటోల ఓవర్‌లోడింగ్, ఎడమవైపు నుంచి ఓవర్‌టేకింగ్ వంటి ప్రమాదకర అలవాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.
ప్రజల్లో సురక్షిత డ్రైవింగ్ సంస్కృతి పెంపొందించి, రోడ్డు భద్రతా వ్యవస్థలను పటిష్ఠం చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, అన్ని ప్రభుత్వ శాఖల భాగస్వామ్యంతో రోడ్డు భద్రతలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బాబ్జి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్సై వీరేందర్, మండలంలోని సర్పంచులు పాల్గొన్నారు.