Home ఎడ్యుకేషన్ గ్రంథాలయం విద్యార్థుల భవిష్యత్తుకు కొత్త వెలుగు !

గ్రంథాలయం విద్యార్థుల భవిష్యత్తుకు కొత్త వెలుగు !

33
0
  • జిల్లా కలెక్టర్ అనుదీప్

ఖమ్మం, మార్చి 25, ఆర్గాన్ న్యూస్:

విద్యార్థుల కలలకు పునాది వేస్తూ, ఖమ్మం జిల్లా గ్రంథాలయం ఆధునీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనులను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆకస్మికంగా తనిఖీ చేసి, అభివృద్ధి పనులు నాణ్యతతో, సమయానికి పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
బస్ డిపో రోడ్‌లో ఉన్న జిల్లా గ్రంథాలయంలో నిర్మిస్తున్న నూతన రెండు అంతస్తుల భవనం, ప్రహరీ గోడ, టాయిలెట్లు వంటి పనులను అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజతో కలిసి పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు అవసరమైన ప్రతి సౌకర్యం కల్పించాలని సూచించారు.
రీడింగ్ రూమ్‌లను సందర్శించిన కలెక్టర్, అక్కడ చదువుతున్న విద్యార్థులతో నేరుగా మాట్లాడారు.
“మీకు ఏ పుస్తకాలు కావాలి? ఏ పరీక్షలకు సిద్ధమవుతున్నారు?” అని అడిగి తెలుసుకుని, అవసరమైన పుస్తకాలను 10 రోజుల్లో అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు.

పోటీ పరీక్షలకు ఫుల్ సపోర్ట్

ప్రతి సంవత్సరం అప్‌డేట్ అయ్యే పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉంచాలి
పాత పుస్తకాలను తొలగించి, కొత్త ఎడిషన్‌లను తీసుకురావాలి
ప్రతి విభాగానికి సంబంధించిన పుస్తకాల జాబితా వెంటనే సిద్ధం చేయాలి
అని గ్రంథాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

“గ్రంథాలయం – విజయానికి మార్గదర్శి”

కలెక్టర్ మాట్లాడుతూ,
గ్రంథాలయాలు కేవలం పుస్తకాల గదులు కాకుండా, విద్యార్థుల ఆలోచనా శక్తిని పెంచే కేంద్రాలని అన్నారు. ప్రాక్టికల్ లెర్నింగ్, వార్తాపత్రికలు, సాహిత్యం ద్వారా విజ్ఞానం పెంపొందించుకోవచ్చని తెలిపారు.
“విలువైన సమయాన్ని వృథా చేయకుండా, గ్రంథాలయాల్లో గడపండి…
అక్కడే మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయబడుతుంది” అని యువతకు పిలుపునిచ్చారు.
ఖమ్మం జిల్లా గ్రంథాలయం త్వరలోనే ఆధునిక సౌకర్యాలతో విద్యార్థుల విజయానికి కేంద్రంగా మారబోతోంది.
ఇది చదువుకునే ప్రతి యువకుడికి ఒక గొప్ప అవకాశము.