- సిపిఐ కరీంనగర్, ఆర్గాన్ న్యూస్, మార్చి 24:
కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో మున్సిపల్ ఎన్నికల ముందు మంజూరైన రూ.50 కోట్ల అభివృద్ధి పనుల టెండర్లను ఇప్పటికీ ప్రారంభించకపోవడంపై సిపిఐ నాయకులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు పిలిచిన టెండర్లను ఆన్‌లైన్‌లో సమర్పించినప్పటికీ, రెండు నెలలు దాటినా వాటిని ఓపెన్ చేయకుండా కొత్తగా టెండర్లు పిలవాలని ప్రయత్నించడం దురుద్దేశపూరితమని విమర్శించారు.
సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శులు న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజు మాట్లాడుతూ— అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ నిధుల కింద రూ.50 కోట్లు మంజూరై, విలీన గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించాల్సి ఉందన్నారు. మొత్తం 87 పనులకు పరిపాలన అనుమతి లభించగా, వాటిలో 25 పనులకు కాంట్రాక్టర్లు బిడ్ వేయలేదని, మిగిలిన 62 పనులకు టెండర్లు వచ్చినప్పటికీ, వాటిని ఖరారు చేసి పనులు ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు.
కొన్ని పనులకు సింగిల్ టెండర్లు వచ్చిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం వాటిని పరిశీలించి ఎల్ఓఏ ఇచ్చి పనులు ప్రారంభించాల్సి ఉండగా, కొత్త పాలకవర్గం మళ్లీ టెండర్ల ప్రక్రియ ప్రారంభించాలని చూడడం సిగ్గుచేటని అన్నారు. ఇది పూర్తిగా కమిషన్ల కోసం తీసుకున్న నిర్ణయమని ఆరోపించారు.
ఒకవైపు పారదర్శక పాలన గురించి గొప్పలు చెబుతున్న నాయకులు ఉన్నప్పటికీ, మున్సిపల్ పాలకవర్గం మాత్రం నగర అభివృద్ధిని పక్కన పెట్టి కమిషన్ల కోసం టెండర్లను నిలిపివేస్తోందని విమర్శించారు. రాజకీయ జోక్యంతో అనేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, విలీన డివిజన్లలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఈ పరిస్థితిలో అధికారులు తక్షణమే జోక్యం చేసుకుని టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులు వేగంగా ప్రారంభించాలన్నారు. లేకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజులు హెచ్చరించారు.


