Home క్రైమ్ పొక్సో కేసులో నిందితుడికి జైలుశిక్ష

పొక్సో కేసులో నిందితుడికి జైలుశిక్ష

18
0
  • ఐదేళ్ల బాలికపై లైంగికదాడి కేసులో 7ఏళ్ల జైలు శిక్ష
  • రూ.50 వేల జరిమానా విధించిన ఖమ్మం కోర్టు
  • మీడియాకు వివరాలు వెళ్ళడించిన రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి

ఖమ్మం రూరల్ , మే 27 (ఆర్గాన్ న్యూస్):

ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి ఖమ్మం కోర్టు కఠిన శిక్ష విధించింది. నిందితుడు బోయినపల్లి వీరబాబు (40)కు ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా & సెషన్స్ జడ్జి బి. శ్రీనివాసరావు తీర్పు వెలువరించారు. ఈ విషయాన్ని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి వెల్లడించారు.
ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. 2023 మే 28న ఖమ్మం రూరల్ మండలానికి చెందిన నిందితుడు ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను మాయమాటలతో తన ఇంట్లోకి తీసుకెళ్లి టీవీ శబ్దం పెంచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 279/2023గా కేసు నమోదు చేశారు.
ఈ కేసులో ఐపీసీ సెక్షన్లు 323, 354(A)(B), 506తో పాటు పొక్సో చట్టం 2012లోని సెక్షన్ 8 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు వేగంగా విచారణ పూర్తి చేసి, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలతో కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు.
కేసులో సమర్పించిన సాక్ష్యాలు, వైద్య నివేదికలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిపై మోపిన అభియోగాలు రుజువయ్యాయని తేల్చి శిక్ష ఖరారు చేసింది.
ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శరత్ కుమార్ రెడ్డి వాదనలు వినిపించారు. కేసు విచారణలో కీలకంగా వ్యవహరించిన ఎస్సై వెంకటకృష్ణ, భరోసా లీగల్ ఆఫీసర్ ఎం. ఉమారాణి, కోర్టు కానిస్టేబుల్ ఎం. వెంకయ్య, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ శ్రీకాంత్, హోంగార్డ్ చిట్టిబాబును పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.