పోష్ చట్టంపై అందరికీ తప్పనిసరిగా అవగాహన కల్పించాలి
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
మహిళల భద్రతే ప్రథమ ప్రాధాన్యం
జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు జిల్లా, ఆర్గాన్ న్యూస్, మే :25
పని ప్రదేశాలలో మహిళలకు పోష్ చట్టం ఒక రక్షణ కవచంలా ఉంటుందని పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టం 2013 పై ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా అవగాహన కల్పించాలని మహిళలను వేధిస్తే చట్టం ప్రకారం కఠిన శిక్షలు విధించబడతాయని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు.
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మే 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న మహిళా వారోత్సవాలలో భాగంగా మహిళల భద్రత రక్షణ కార్యక్రమం సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు.పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టంపై జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలు గౌరవంగా భయభ్రాంతులు లేకుండా పనిచేసే వాతావరణం కల్పించాలని అన్నారు. పోష్ చట్టం మహిళా ఉద్యోగులకు రక్షణ కవచంలా పనిచేస్తుందని పేర్కొన్నారు.ప్రతి కార్యాలయంలో 10 మందికి పైగా ఉద్యోగులు ఉంటే అంతర్గత ఫిర్యాదుల కమిటీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.వేధింపులకు గురైన మహిళలు మౌనంగా ఉండకుండా ధైర్యంగా ఫిర్యాదు చేయాలని ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా బాధ్యులపై నిర్దేశిత గడువులోపు చర్యలు తీసుకునేలా చూస్తామని అన్నారు.పోష్ చట్టంపై ప్రతి ఉద్యోగికి అవగాహన కల్పించాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు.మహిళా ఉద్యోగుల భద్రతకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగితే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. షీ-టీమ్స్ భరోసా కేంద్రాల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు.జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత మాట్లాడుతూ జిల్లాలో మే 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఘనంగా మహిళా వారోత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పోష్ చట్టంపై ప్రత్యేక కార్యక్రమాల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు.బాల్య వివాహం బతుకు ఆగం అనే నినాదంతో బాల్యవివాహాల రహిత ములుగు జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.అనంతరం పోష్ చట్టం న్యూట్రిషన్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు జిల్లా అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జీ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంపత్ రావుతో కలిసి ఆవిష్కరించారు.అంతకముందు చట్టబద్ధమైన దత్తతను ప్రోత్సహించడం కొరకు చట్టబద్ధమైన దత్తతపై అవగాహన పెంచుట కొరకు దత్తత సహాయక కేంద్రంను ప్రారంభించి మహిళా భద్రత పై సంతకాల సేకరణను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చంద్రకళ ఆర్డీవో వెంకటేష్ డీఎస్పీ కిషోర్ జిల్లా అధికారులు సీడీపీఓలు మండలాల ఎమ్మార్వోలు ఎంపీడీవోలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.









