Home ఖమ్మం ప్రతి ఫిర్యాదును సకాలంలో పరిష్కరించాలి

ప్రతి ఫిర్యాదును సకాలంలో పరిష్కరించాలి

5
0
  • ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
  • జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
  • ప్రజావాణికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలి
  • అధికారులు సమన్వయంతో పని చేస్తే ఏ సమస్య పెద్దది కాదు
  • జిల్లా అధికారులతో పరిపాలన అంశాలపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

ఆర్గాన్ న్యూస్, ఖమ్మం, జూన్15:

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును సకాలంలో పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అధికారులను ఆదేశించారు.
సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డిలతో కలిసి జిల్లా అధికారులతో వివిధ పరిపాలనా అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ…

ప్రైవేటు భవనాల్లో నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యుత్ బిల్లులకు సంబంధించిన సమస్యలు ఎక్కడైనా ఉంటే క్షేత్రస్థాయి అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రజావాణి కార్యక్రమానికి ఒకే దరఖాస్తుదారుడు పలుమార్లు రావాల్సిన పరిస్థితి రాకుండా చూడాలని, సమస్య పరిష్కారం కాని పక్షంలో అందుకు గల కారణాలను స్పష్టంగా వివరిస్తూ సమాధానం అందించాలని సూచించారు.
ప్రతి అధికారి తన ఆధీనంలోని సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకోవాలని, తమ పరిధిలో ఉన్న సమస్యలను తప్పని సరిగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది పని తీరుపై సంబంధిత అధికారుల బాధ్యత ఉంటుందని స్పష్టం చేశారు. ముందస్తు సమాచారం లేకుండా ఏ జిల్లా అధికారి కూడా ప్రజావాణికి గైర్హాజరు కావొద్దని హెచ్చరించారు.
జిల్లా కలెక్టర్ ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని వంద శాతం అమలు చేయాలని, పది శాతం కూడా వ్యత్యాసం ఉంటే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లాలో అధికారుల పరిష్కారానికి అందని పెద్ద సమస్యలేవి లేవని, అందరూ సమన్వయంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు. ప్రతి అధికారి, ఉద్యోగి మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఇప్పుడు చేసే కృషికి అదనంగా 20 శాతం కృషి చేస్తే ఫలితాలు 100 శాతం పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ పారస్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్. రామ్మూర్తి, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ ఏఓ కే. శ్రీనివాస రావు, తదితరులు పాల్గొన్నారు.