- పని ప్రదేశాల్లో మహిళల భద్రతే ప్రభుత్వ లక్ష్యం
- జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం
ఖమ్మం, ఆర్గాన్ న్యూస్,జనవరి 5:
పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు ఎలాంటి తావు లేకుండా పోష్ యాక్ట్-2013ను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013 (పోష్ యాక్ట్) అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…
పని ప్రదేశాల్లో మహిళలను లైంగికంగా వేధించడం చట్టపరమైన నేరమని, పోష్ యాక్ట్–2013 కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 10 మందికి పైగా సిబ్బంది పనిచేసే ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (ICC) ఏర్పాటు చేయాలని సూచించారు.
అంతర్గత ఫిర్యాదుల కమిటీలో కనీసం 50 శాతం మహిళా సభ్యులు ఉండాలని, 10 మందికి తక్కువ సిబ్బంది ఉన్న కార్యాలయాల్లో ఎదురయ్యే సమస్యలపై కలెక్టరేట్ ఆధ్వర్యంలోని కమిటీకి నేరుగా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.
ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలు, ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా నెల రోజుల లోపు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో రూ.50 వేల జరిమానా విధించబడుతుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.
అలాగే చిల్డ్రన్ హోమ్‌లలో నివసిస్తున్న అనాథ పిల్లలకు కుల ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, జనన ధృవీకరణ పత్రం, ఆరోగ్యశ్రీ కార్డు తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం జిల్లా అధికారులతో కలిసి పోష్ యాక్ట్–2013కు సంబంధించిన గోడపత్రాలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్వో ఏ. పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఆర్డీఓ సన్యాసయ్య, జిల్లా సంక్షేమ అధికారిణి వి. విజేత, కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాసరావు, డీహెచ్‌ఈడబ్ల్యూ సమ్రీన్, శ్రీనివాస్‌తో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మహిళలకు భద్రమైన పని వాతావరణం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ కార్యక్రమం మరోసారి స్పష్టం చేసింది.


