- నీట్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
- భావ ప్రకటన స్వేచ్ఛను అణిచివేసే ప్రయత్నాలను తిప్పికొడతాం
- నందిగామ రాజ్‌కుమార్ (జానీ)
ఆర్గాన్ న్యూస్,ఖమ్మం టూ టౌన్ , జూన్ 16:
దేశంలో ప్రశ్నించే గొంతుకలపై, యువతపై జరుగుతున్న మతోన్మాద దాడులను సహించేది లేదని, రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రాణాలర్పించి అయినా కాపాడుకుంటామని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర విభజన విభాగం అధ్యక్షుడు నందిగామ రాజ్‌కుమార్ (జానీ) స్పష్టం చేశారు.
జైపూర్‌లో సామాజిక కార్యకర్త అబ్ జిత్ దీప్‌కే పై జరిగిన దాడిని నిరసిస్తూ ఖమ్మం జెడ్పీ సెంటర్‌లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నందిగామ రాజ్‌కుమార్ జానీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్, ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ పాలకుర్తి కృష్ణ, నాయకుడు పెళ్లూరి విజయ్‌కుమార్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా నందిగామ రాజ్‌కుమార్ మాట్లాడుతూ, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా యువత ఆందోళన చెందుతోందన్నారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై దాడులు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని మండిపడ్డారు.
ప్రశ్నించే వారిని బెదిరించే రాజకీయాలు ఇకపై సాగవని, యువతను అణచివేయాలనే ప్రయత్నాలు తీవ్ర ప్రతిఘటనకు దారితీస్తాయని హెచ్చరించారు. తెలంగాణ గడ్డపై ప్రజాస్వామ్య హక్కుల కోసం జరిగే పోరాటాలను అడ్డుకునే ప్రయత్నాలను తిప్పికొడతామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ చీమ శ్రీనివాస్, పాలకుర్తి కృష్ణ, పెళ్లూరి విజయ్‌కుమార్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యువత, మేధావులు, ప్రజాసంఘాలు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అబ్ జిత్ దీప్‌కే పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో ఎదురుగట్ల చిట్టిమల్లు, కొరివి ధనలక్ష్మి, అబ్దుల్ రెహమాన్, రమాదేవి, దగ్గుపాటి రమా, గ్లోరీ, మరియా కుమారి, రోజా, అహల్య, పద్మ, కుక్కల రామకృష్ణ, సమ్మన్న, నాగుల్ మీరా, సైదేశ్వరరావు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత, ఉద్యమకారులు పాల్గొన్నారు.









