Home Uncategorized మొక్కలే కాదు… నిధులే ఎండిపోయాయా ?

మొక్కలే కాదు… నిధులే ఎండిపోయాయా ?

21
0
  • రవాణా శాఖ ఎంవీఐలపై కలెక్టర్ సంచలన వ్యాఖ్యలు
  • నిధులు కేటాయించి కూడా ఫలితం శూన్యం
  • రవాణా శాఖ అధికారులపై కలెక్టర్ అసంతృప్తి మానకొండూర్, ఆర్గాన్ న్యూస్, జనవరి 31:

కరీంనగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల (ఎంవీఐలు) పనితీరుపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల నిర్వహణలో అధికారులు చూపుతున్న నిర్లక్ష్య ధోరణిపై కలెక్టర్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ ఆస్తులు, ప్రజల సొమ్ముతో చేసిన పనుల పట్ల కనీస బాధ్యత కూడా లేకుండా వ్యవహరించడం అసహ్యకరమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కార్యాలయ ప్రాంగణంలో సుమారు రూ.20 లక్షల వ్యయంతో చేపట్టిన ప్లాంటేషన్ (మొక్కల పెంపకం) పనులు కాగితాలకే పరిమితమయ్యాయన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. లక్షలాది రూపాయలు వెచ్చించి నాటిన మొక్కలు సంరక్షణ లేక ఎండిపోయిన పరిస్థితిని స్వయంగా పరిశీలించిన కలెక్టర్, అధికారుల నిర్వాహణ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మొక్కలకు నీరు పోయడం, గార్డులు ఏర్పాటు చేయడం, పర్యవేక్షణ వంటి కనీస చర్యలు కూడా చేపట్టకపోవడంపై ఆమె మండిపడ్డారు.
“రూ.20 లక్షలు ఖర్చు చేసినప్పుడు, కనీసం రూ.20 వేలు ఖర్చు చేసి మొక్కలను కాపాడుకునే బాధ్యత కూడా అధికారులకు లేదా?” అంటూ ఎంవీఐలను నిలదీశారు. నిధులు కేటాయించినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోవడంలో ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. ప్లాంటేషన్ పేరుతో ప్రభుత్వ నిధులు ఖర్చు చేసి, ఆ తర్వాత వాటి నిర్వహణను గాలికొదిలేయడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
పర్యావరణ పరిరక్షణ ప్రభుత్వ ప్రాధాన్యతలలో ఒకటని గుర్తు చేస్తూ, మొక్కల పెంపకం కేవలం అధికారిక లెక్కల కోసమే కాకుండా, భవిష్యత్ తరాల కోసం అవసరమని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇలాంటి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసినట్లేనని ఆమె అన్నారు.
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో విఫలమైన అధికారులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. ప్లాంటేషన్ పనులపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని, బాధ్యులైన అధికారులను గుర్తించి తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇకపై మొక్కల సంరక్షణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు.
ప్రజల సొమ్ము ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా వినియోగించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, అలాంటి బాధ్యతారాహిత్య ధోరణి కొనసాగితే సహించబోమని కలెక్టర్ పమేలా సత్పతి తేల్చిచెప్పారు. రవాణా శాఖ కార్యాలయంలోని ఈ నిర్లక్ష్య ఘటన జిల్లాలో అధికారుల పనితీరుపై పెద్ద చర్చకు దారితీస్తోంది.