Home తెలంగాణ గిరిజన పట్టా భూమిలో అనుమతి లేకుండా నిర్మించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాలి

గిరిజన పట్టా భూమిలో అనుమతి లేకుండా నిర్మించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాలి

18
0
  • పెసా గ్రామ సభ తీర్మానం, జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా నిర్మాణం
  • మన్యసీమ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గొప్ప వీరయ్య డిమాండ్

ములుగు జిల్లా,ఆర్గాన్ న్యూస్,మార్చి 27:

ములుగు జిల్లా మంగపేట మండలంలో గిరిజన పట్టా భూమిలో భూమి యజమాని అనుమతి లేకుండా నిర్మించిన ఎన్టీఆర్ విగ్రహాన్ని వెంటనే తొలగించాలని మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గొప్ప వీరయ్య డిమాండ్ చేశారు.

శుక్రవారం మంగపేటలో మన్యసీమ భవనంలో మండల అధ్యక్షుడు తాటి నాగరాజు అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గొప్ప వీరయ్య మాట్లాడుతూ ములుగు జిల్లా షెడ్యూల్డ్ ఏరియా ప్రాంతం భారత రాష్ట్రపతి 07-12-1950న గిరిజన గ్రామాలుగా గుర్తించబడిందని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో చట్టాలను ఉల్లంఘిస్తూ గిరిజనేతరులు ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

పద్మూర్ రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 95 (0-24), సర్వే నంబర్ 96 (1-35)లో గిరిజనులకు చెందిన పట్టా భూముల్లో, సంబంధిత పట్టాదారుల అనుమతి లేకుండా ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ నిర్మాణానికి ఎవరు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు.
కుమరం భీమ్ వంటి ఆదివాసీ నాయకుల పోరాట ఫలితంగా గిరిజన భూ హక్కులకు చట్టబద్ధ రక్షణ లభించిందని, 1949 అక్టోబర్ 1న గిరిజన భూబదలాయింపు నిషేధ చట్టం అమల్లోకి వచ్చిందని తెలిపారు. గిరిజనుల హక్కులను కాపాడేందుకు అమలులో ఉన్న చట్టాలను ఉల్లంఘించడం తీవ్రమైన విషయం అన్నారు.
పెసా చట్టం ప్రకారం గ్రామ సభ అనుమతి లేకుండా, అలాగే జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఎన్టీఆర్ విగ్రహం నిర్మాణం జరగడం చట్టాల ఉల్లంఘనగా పేర్కొన్నారు.
గిరిజనుల హక్కులను దెబ్బతీసే విధంగా ఎవరు వ్యవహరించినా సహించబోమని, అవసరమైతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈసం యాదయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు ఆక తిరుమల్ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తోలేం సుధాకర్, నాయకులు పున్నెం రాములు, గొప్ప చంద్రకాంత్, చాద హరిబాబు, తాటి నాగరాజు, జబ్బ నరేష్, చీమల నాగభూషణం, కొమరం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.