Home ఎడ్యుకేషన్ ఆకలి చెప్పిన బాలికలకు శిక్ష…!

ఆకలి చెప్పిన బాలికలకు శిక్ష…!

19
0
  • దామరచర్ల గురుకులంలో అమానుషం

మిర్యాలగూడ ప్రతినిధి, ఆర్గాన్ న్యూస్, మార్చి 31:

మిర్యాలగూడ నియోజకవర్గంలోని దామరచర్ల మండల బిసి గురుకుల హాస్టల్‌లో చోటుచేసుకున్న ఘటన సమాజాన్ని కలిచివేస్తోంది. ఆకలితో ఉన్న చిన్నారుల చేతులు మరో గిన్నె అన్నం కోసం ముందుకు సాగితే… అది ప్రేమగా నింపాల్సిన సమయం. కానీ ఇక్కడ ఆ ఆకలి అవమానంగా మారింది. రెండోసారి అన్నం అడిగినందుకు విద్యార్థినులను దాదాపు గంటపాటు మోకాళ్లపై నిలబెట్టిన ఘటన వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
“ఇంత తిన్నాక ఇంకా కావాలా?” అన్న ఒక్క మాట… ఆ చిన్నారుల మనసుల్లో ఎంత గాయం చేసిందో ఎవరైనా ఆలోచించారా? ఆకలితో అడిగిన అన్నం శిక్షగా మారడం ఎంత బాధాకరం! పిల్లలు అన్నం అడగడం వారి సహజ హక్కు. అయితే ఆ హక్కును అవమానంగా మార్చడం మనిషితనానికే మచ్చ అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మోకాళ్లపై నిలబెట్టిన ఆ గంట… పిల్లలకు కేవలం శారీరక నొప్పి మాత్రమే కాదు, మనసులో మిగిలే గాయం కూడా. ఆ చిన్నారుల కన్నీళ్లకు ఎవరు సమాధానం చెబుతారు? ఆ అవమానాన్ని ఎవరు తుడిచేస్తారు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఈ ఘటనపై సంబంధిత టీచర్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హాస్టల్‌లో ఆహార నాణ్యత, సరఫరా, నిర్వహణలో ఉన్న లోపాలపై సమగ్ర విచారణ జరిపి, బాధిత విద్యార్థినులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ప్రత్యేక వ్యాఖ్య:
పాఠశాలలు పిల్లలకు విద్య మాత్రమే కాదు… ప్రేమ, ఆదరణ, భరోసా ఇచ్చే ఆలయాలు కావాలి. అయితే అక్కడే పిల్లల గౌరవం దెబ్బతింటే, అది సమాజానికి పెద్ద హెచ్చరికగా భావించాలి.
పేద పిల్లల ఆకలి వెనుక ఉన్న బాధను అర్థం చేసుకోవడం గురువుల బాధ్యత. అన్నం అడిగినందుకు శిక్షించడం కాదు… ప్రేమగా తినిపించడం గురుత్వం. పిల్లల గుండెల్లో భయం కాకుండా నమ్మకం నాటాలి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలతో పాటు మనసులను మార్చే ప్రయత్నం అవసరం.
పిల్లల గౌరవం కాపాడటం… మనందరి బాధ్యత. ఆకలితో ఉన్న చిన్నారి కన్నీరులను తుడవడం… అదే నిజమైన మానవత్వం.